Monsoon arrives: రైతులకు శుభవార్త; కేరళకు చేరిన నైరుతి రుతుపవనాలు..
రైతాంగం ఎదురు చూపులు ఫలించాయి. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళకు చేరాయి. జూన్ 1 వ తేదీన రావాల్సిన రుతు పవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి.
రైతాంగం ఎదురు చూపులు ఫలించాయి. నైరుతి రుతుపవనాలు (Monsoon) గురువారం కేరళకు చేరాయి. జూన్ 1 వ తేదీన రావాల్సిన రుతు పవనాలు వారం రోజులు ఆలస్యంగా కేరళ తీరాన్ని తాకాయి. బిపోర్జాయ్ తుపాను కారణంగా రుతు పవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో.. గురువారం నైరుతి రుతు పవనాలు కేరళ తీరానికి చేరాయి.
వర్షాలు ప్రారంభం..
నైరుతి రుతుపవనాల కారణంగా కేరళలో గత 24 గంటలుగా వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రుతు పవనాలు మరింత విస్తరించడానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయని శుభవార్త తెలిపింది. రానున్న 48 గంటల్లో కేరళ, తమిళనాడు, కర్నాటక, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బిపోర్జాయ్ తుపాను కారణంగా రుతు పవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అయితే, ఆ తుపాను ప్రభావం తగ్గిన తరువాత రుతు పవనాల గమనం మళ్లీ వేగవంతమవుతుందని తెలిపారు. నైరుతి రుతు పవనాలు కేరళ తీరానికి చేరడానికి మరో 2, 3 రోజులు పడుతుందని బుధవారం ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ స్కై మెట్ ప్రకటించింది. రైతులు వ్యవసాయ పనులను కొంత ఆలస్యంగా ప్రారంభించాలని సూచించింది. అయితే, స్కై మెట్ అంచనాలకు విరుద్ధంగా గురువారం నాటికే నైరుతి రుతుపవనాలు కేరళ తీరం చేరుకున్నాయి.
జూన్ లో తక్కువ వర్షపాతం
బిపోర్జాయ్ తుపాను కారణంగా బలహీనపడిన రుతు పవనాల వల్ల జూన్ నెలలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మీటియోరాలజీ సైంటిస్ట్ రాక్సీ మేథ్యూ కోల్ తెలిపారు. ఇప్పుడు కేరళలో పడుతున్న వర్షాలు కూడా.. పూర్తి స్థాయి రుతు పవన వర్షాలు కావని, తుపాను నుంచి రుతుపవనాలు తీసుకున్న తేమ కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి. ఆ తరువాత జులై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయి.