Modi Trump Meeting : ట్రంప్ రూట్లోనే మోదీ! అక్రమ వలసదారులపై కీలక కామెంట్స్..
Modi in US : అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న అక్రమ వలసదారులను వెనక్కి తీసుకుంటామని భారత ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో అగ్రరాజ్యంలో అక్రమ వలసదారుల సమస్య గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తుంటే, వారిని వెనక్కి తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
“సాధారణంగా అక్రమ వలసదారులు సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వారే ఉంటారు. వారికి పెద్ద పెద్ద కలలు ఆశ చూపించి, వారిని తప్పుదోవపట్టించి అక్రమంగా తీసుకెళుతుంటారు. అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న భారత పౌరులను వెనక్కి తీసుకెళ్లడానికి మేము సిద్ధం,” అని మోదీ అన్నారు.
అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా జీవిస్తున్న వారిని ట్రంప్ యంత్రాంగం టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే 100కుపైగా మంది భారతీయులను ఇటీవలే ప్రత్యేక మిలిటరీ విమానంలో ఇండియాకు పంపించేసింది అమెరికా. అక్రమ వలసదారుల కాళ్లకు సంకెళ్లు కట్టి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఫలితంగా అక్రమ వలసల వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. భారత ప్రభుత్వం సైతం ఈ విషయంపై స్పందించింది. అక్రమ వలసలు ఏ దేశానికీ మంచిది కాదని వ్యాఖ్యానించింది. అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న భారతీయులను వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతు తెలుపుతూ, మానవ అక్రమ రవాణాను అంతమొందించడానికి మొత్తం వ్యవస్థను దాని మూలాల నుంచి నాశనం చేయాల్సిన అవసరాన్ని మోదీ తాజాగా చెప్పుకొచ్చారు.
అమెరికాలో భారతీయ అక్రమ వలసదారులు ఎంతమంది?
భారత్ నుంచి 7,25,000 మందికి పైగా వలసదారులు అనుమతి లేకుండా అమెరికాలో నివసిస్తున్నారని ప్యూ రీసెర్చ్ సెంటర్‌ను ఉటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ ఏపీ నివేదించింది. ఈ వలసదారులకు అమెరికాలోకి ప్రవేశించడానికి అధికారిక పత్రాలు లేదా అనుమతి లేదని పేర్కొంది.
కాగా, అమెరికాలో అక్రమ వలసదారుల సంఖ్యపై భారత ప్రభుత్వం వద్ద ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
"అమెరికాలో నివసిస్తున్న డాక్యుమెంట్లు లేని భారతీయ వలసదారుల సంఖ్యపై భారత ప్రభుత్వం వద్ద డేటా లేదు. ఇందుకు కారణాలు ఉన్నాయి. ఈ వలసదారులు చట్టబద్ధంగా భారతదేశం నుంచి వెళ్లి ఉండొచ్చు కానీ వారికి యూఎస్ వీసా చెల్లుబాటు గడువు దాటిపోయింది లేదా చట్టవిరుద్ధంగా లేదా సరైన పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించారు," అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఫిబ్రవరి 13న రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
సంబంధిత కథనం