Ropeway Projects : 18 రోప్ వే ప్రాజెక్టులకు కేంద్రం సన్నాహాలు.. లిస్టులో ఏపీలోని బోయకొండ గంగమ్మ ఆలయం కూడా
Ropeway Projects : దేశంలోని ప్రధాన మతపరమైన ప్రదేశాలలో 18 రోప్‌వే ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం కన్సల్టెంట్లను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ ప్రాజెక్ట్ ఉంది. రోప్‌వే ప్రాజెక్టులు ఎక్కడెక్కడ వస్తున్నాయో చూద్దాం..
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 18 ప్రధాన మతపరమైన, పర్యాటక ప్రదేశాలలో రోప్‌వే ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, 2025 జనవరి 25న భారతదేశం అంతటా 18 రోప్‌వే ప్రాజెక్ట్‌ల కోసం డీపీఆర్ అంటే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కన్సల్టెంట్లను ఆహ్వానించింది. మతపరమైన, పర్యాటక ప్రదేశాలకు చేరుకోవడానికి అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన వారికి రోప్‌వే ప్రయాణం ద్వారా సులభతరం అవుతుంది.

బల్తాల్ నుండి అమర్‌నాథ్ ఆలయానికి 11.6 కి.మీ పొడవున్న రోప్‌వేను ప్రతిపాదన ఉంది. ఇది జాబితాలో అతిపెద్ద ప్రాజెక్ట్. ప్రస్తుతం బల్తాల్ లేదా పహల్గామ్ నుండి కాలినడకన లేదా హెలికాప్టర్ ద్వారా గుహను చేరుకోవడానికి ఏకైక మార్గం. జాబితాలో దక్షిణ భారతదేశంలోని ప్రధాన ధార్మిక క్షేత్రమైన పతనంతిట్టలోని శబరిమల ఆలయానికి 2.62 కిలోమీటర్ల పొడవైన రోప్‌వే కూడా ఉంది.
జైపూర్‌లోని నహర్‌ఘర్ కోటతో అమెర్ కోటను 6.45 కి.మీ పొడవైన రోప్‌వే ద్వారా అనుసంధానించే ప్రణాళిక ఉంది. ఇది కాకుండా ముస్సోరీ నుండి కెంప్టీ జలపాతం వరకు 3.21 కి.మీ పొడవైన రోప్‌వే కూడా ఉండనుంది. తమిళనాడులోని పర్వతమలై ఆలయం 3.21 కిలోమీటర్ల పొడవుతో మరో ప్రతిపాదిత రోప్‌వే. జమ్మూ, కాశ్మీర్‌లోని సోనామార్గ్ నుండి థాజివాస్ గ్లేసియర్ వరకు 1.6 కి.మీ పొడవైన రోప్‌వే కూడా ప్రతిపాదనలో ఉంది. దీనిని పర్యాటకులు ఎక్కువగా ఉండే కాలంలో ఉపయోగించుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని శివనేరి కోట, చిక్కమగళూరులోని ముల్లయన గిరి కూడా 1.41 కి.మీ, 2.38 కి.మీ పొడవుతో రోప్‌వేల లిస్టులో ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని చాముండా దేవి ఆలయం, ఉత్తరాఖండ్‌లోని కుంజపురి ఆలయం(రిషికేశ్ నుండి), జ్వాలా నరసింహ స్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ బోకొండ గంగమ్మ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని సల్కాన్‌పూర్ వాలి మాత ఆలయం, అస్సాంలోని భుబన్ పాహ్ మహాదేవ్ ఆలయం కోసం కూడా రోప్‌వేలు రానున్నాయి.