Delimitation: డీలిమిటేషన్ పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పారదర్శకత, స్పష్టత కొరవడిందని ఆందోళన వ్యక్తం చేస్తూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) శనివారం ఈ అంశంపై తీర్మానం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్రం పారదర్శకత పాటించాలని డిమాండ్ చేసిన జేఏసీ 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల ఏర్పాటును వచ్చే 25 ఏళ్ల పాటు పొడిగించాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా పారదర్శకంగా జరగాలని, అన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర భాగస్వామ్య రాజకీయ పార్టీలు చర్చించడానికి, సహకరించడానికి వీలు కల్పించాలని జేఏసీ ఆమోదించిన తీర్మానం పేర్కొంది. 42, 84, 87వ రాజ్యాంగ సవరణల వెనుక ఉన్న శాసన ఉద్దేశం జనాభా నియంత్రణ చర్యలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలను రక్షించడం/ ప్రోత్సహించడం, జాతీయ జనాభా స్థిరీకరణ లక్ష్యాన్ని ఇంకా సాధించనందున, 1971 జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల ఫ్రీజింగ్ ను మరో 25 సంవత్సరాలు పొడిగించాలి" అని పేర్కొంది.
‘‘నాటి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా అమలు చేశాయి. తత్ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. ఇందుకు ఆ రాష్ట్రాలను శిక్షించడం సరికాదు. వాటా తగ్గిన రాష్ట్రాలకు శిక్ష విధించకూడదు. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణలను కేంద్ర ప్రభుత్వం రూపొందించాలి’’ అని జేఏసీ తీర్మానించింది. అంతేకాకుండా, ఈ సమావేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ అంశంపై తగిన శాసనసభ తీర్మానాలను తీసుకురావాలని జేఏసీ తీర్మానించింది.
అంతేకాకుండా పైన పేర్కొన్న సూత్రాలకు విరుద్ధంగా, రాష్ట్రాలకు నష్టం కలిగేలా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలను తిప్పికొడతామని జేఏసీ తీర్మానించింది. జేఏసీ తొలి సమావేశం శనివారం చెన్నైలో జరిగింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఒడిశా కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, బిజూ జనతాదళ్ నేత సంజయ్ కుమార్ దాస్ బర్మా, బీఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై తదుపరి సమావేశం హైదరాబాద్ లో జరుగుతుందని స్టాలిన్ తెలిపారు.
డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా చెన్నైలో జరిగిన సదస్సుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ‘‘తమిళనాడు ఎదుర్కొంటున్న మద్యం కుంభకోణం ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు అధికార డీఎంకే చేస్తున్న ప్రయత్నం ఇది’’ అని ఆరోపించారు. తెలంగాణలోని కరీంనగర్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీలిమిటేషన్ విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, దక్షిణాదిలో సీట్ల సంఖ్య తగ్గదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే చెప్పారని తెలిపారు. తమిళనాడులో అధికార డీఎంకే రూ.1,000 కోట్ల మద్యం కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటోందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
సంబంధిత కథనం
టాపిక్