Miss world 2023 India : మిస్ వరల్డ్ పాజెంట్.. ఇండియాకు తిరిగొస్తోంది! దాదాపు మూడు దశాబ్దాల తర్వాత.. ఈ పోటీలకు భారత దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ వేదికగా.. మిస్ వరల్డ్ 71వ ఎడిషన్.. ఈ ఏడాది చివరిలో జరుగుతుంది. చివరిగా.. 1996లో ఈ బ్యూటీ పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇచ్చింది. అంటే 27ఏళ్ల తర్వాత దేశానికి మళ్లీ ఈ ఛాన్స్ దక్కింది.
మిస్ వరల్డ్ 2023.. ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతుందని తెలుస్తోంది. కాగా తుది డేట్‌తో పాటు పూర్తి వివరాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
"మిస్ వరల్డ్ 71వ ఫినాలేను ఇండియాలో నిర్వహిస్తున్నామని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతులను చూసేందుకు మేము ఎదురుచూస్తున్నాము. అద్భుతమైన ప్రాంతాలను ప్రపంచానికి చూపిద్దామని అనుకుంటున్నాము," అని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే.. మీడియాకు తెలిపారు.
"మిస్ వరల్డ్ 2023 71వ ఎడిషన్ కోసం 130 దేశాల నుంచి పోటీదారులు వస్తారు. నెల రోజుల పాటు 'ఇంక్రెడిబిబుల్ ఇండియా'లో వారి ప్రయాణం జరుగుతుంది," అని జూలియా స్పష్టం చేశారు.
Miss world 2023 venue : నెల రోజుల పాటు సాగే ఈ పోటీలు చాలా కఠినంగానే ఉంటాయి! టాలెంట్ ప్రదర్శన, స్పోర్ట్స్ ఛాలెంజ్, ఛారిటీ పనులతో పాటు మార్పునకు చిహ్నంగా నిలిచే వారిని ఈ పోటీల్లో అన్వేషిస్తారు.
మిస్ వరల్డ్ 2022 విజేత కరోలినా బిలావాస్క ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. మిస్ వర్డ్ 2023 పోటీలను ప్రచారం చేస్తున్నారు. ఇండియాలో ఈ బ్యూటీ పాజెంట్ జరుగుతుండటం చాలా సంతోషకరం అని ఆమె వ్యాఖ్యానించారు.
"యావత్ ప్రపంచంలోనే భారత్ గొప్ప ఆతిథ్యాన్ని కలిగి ఉంది. నేను ఇండియాకు రావడం ఇది రెండోసారి. ఇది నా ఇల్లులాగా అనిపిస్తుంది. ఐకమత్యం, వైవిధ్యం, కుటుంబం, గౌరవం, ప్రేమ, దయా వంటి విలువలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూసేందుకు ఇంకా చాలా ఉంది. ప్రపంచ మొత్తాన్ని ఇక్కడికి నెల రోజుల పాటు తీసుకొస్తున్నాము. ఇండియాని ప్రపంచానికి చూపించడం మంచి ఐడియా," అని పోలాండ్‌కు చెందిన కరోలినా వ్యాఖ్యానించారు.
Miss world 2023 latest news : మిస్ ఇండియా టైటిల్‌ను ఇప్పటివరకు ఆరుగురు గెలిచారు. 1996లో రీటా ఫారియా, 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హైడెన్, 1999లో యుక్తా మూఖే, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్లు ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మరి ఈసారి ఈ పోటీలు ఇండియాలోనే జరుగుతుండటంతో.. భారత్ నుంచి ఎవరైనా ఆ టైటిల్‌ను గెలిస్తే, అది మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది!
సంబంధిత కథనం