Karnataka Road accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్ని ఢీకొట్టిన బస్సు- 13మంది మృతి!
Karnataka Road accident today : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్ని మినీ బస్సు ఢీకొట్టిన ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటకలో విషాదకర చోటు చేసుకుంది. కర్ణాటకలోని పూణె-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హావేరీ జిల్లాలోని గుండెనహల్లి క్రాసింగ్ వద్ద.. ఆగి ఉన్న ఓ ట్రక్ని ఓ మినీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 13మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం సమయంలో మినీ బస్సులో 17మంది ఉన్నారు. కాగా.. ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.
కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో.. చికిత్స పొందుతూ, మరో ఇద్దరు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు. చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఇదీ చూడండి:- Delhi Airport roof collapse: ఢిల్లీ ఎయిర్ పోర్టు పైకప్పు కూలి ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు విమానాల రాకపోకలకు అంతరాయం
మరణించిన 13మందిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు.
11 మంది మృతుల పేర్లు.. పరశురమ్ (45), భాగ్య (40), నగేశ్ (50), విషాలాక్షి (40), అర్పిత (18), రూప (40), పుణ్య (50), మంజులాబాయ్, చలక ఆదర్శ్ (23), మానస (24), మంజుల (50)గా గుర్తించారు.
కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధితులు అందరు శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకకు చెందిన ఎమ్మెహట్టి గ్రామానికి చెందిన వారని సమాచారం. పుణ్యక్షేత్రానికి వెళ్లి.. బెళగావి జిల్లా నుంచి తిరిగి వస్తుండగా కర్ణాటక రోడ్డు ప్రమాదం జరిగింది.
మృతులు నగేశ్ ఎమ్మెహట్టి గ్రామంలో రైతు. ఆయన భార్య విశాలాక్షి ఆశా వాలంటీరు. వీరి కుమారుడు ఆదర్స్ కొత్తగా మినీ బస్సు కొన్నాడు. ఈ మినీ బస్సుకు పూజ చేయించేందుకు గ్రామంలోని ప్రజలు, జూన్ 24న మహారాష్ట్రలోని తివారీ లక్ష్మి ఆలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తుల్జా భవానీ ఆలయం, కలబురిగిలోని మయమ్మ ఆలయాన్ని సందర్శించుకున్నారు. సవదట్టిలోని రేణుకా యెలమ్మ ఆలయాన్ని సందర్శించుకుని ఇంటికి తిరిగివస్తుండగా.. ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కర్ణాటక రోడ్డు ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ.. మినీ బస్సు డ్రైవర్ నిద్ర కారణంగా, వాహనంపై పట్టు కోల్పోయి, చివరికి.. వాహనం ట్రక్ని ఢీకొట్టినట్టు తెలుస్తోంది.
ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.
దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇది ఆందోళనకరంగా మారింది. భారత దేశ రోడ్లు నెత్తురోడుతున్నాయి.
సంబంధిత కథనం