New Zealand MP: న్యూజీలాండ్ పార్లమెంట్ లో మహిళా ఎంపీ ‘హకా’ డ్యాన్స్; సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
New Zealand: న్యూజీలాండ్ ఎంపీ హనా రహితి కరేరికి మైపీ క్లార్క్ ఒక్కసారిగా సోషల్ మీడియా సెన్సేషన్ గా మారారు. ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లును వ్యతిరేకిస్తూ ఆమె సభలో హకా డ్యాన్స్ మూవ్ మెంట్స్ చేశారు. ఆమెతో పాటు సహచర ఎంపీలు కూడా పదం కలపడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
New Zealand MP Haka dance: న్యూజీలాండ్ పార్లమెంటులో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీ మావోరీ ఎంపీ హనా రవతి కరేరికి మైపీ క్లార్క్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆమె వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. పార్లమెంట్లో వివాదాస్పద బిల్లు ప్రతిని ఆగ్రహావేశాలతో చింపుతూ, ఉద్వేగభరితమైన హాకా నృత్యం చేస్తున్న ఆమె వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
హాకా సాంప్రదాయ మావోరీ నృత్యం
న్యూజిలాండ్ లో జరిగిన పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండిజినస్ ట్రీటీ ప్రిన్సిపల్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సభలో విపక్ష యువ ఎంపీ హనా రవతి కరేరికి మైపీ క్లార్క్ ఆగ్రహావేశాలతో బిల్లు కాపీని ముక్కలుగా చించుతూ, ఉద్వేగభరితంగా హాకా నృత్యం చేశారు. ఆమెకు సహచర ఎంపీలు కూడా తోడుగా నిలిచి నృత్యం చేస్తూ, పదం కలిపారు. ఆమెతో పాటు వారు కూడా హాకా సాంప్రదాయ మావోరీ నృత్యాన్ని ప్రదర్శించారు. దాంతో, సభ కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో స్పీకర్ గెర్రీ బ్రౌన్లీ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
1840 నాటి వెయిటాంగి ఒప్పందం
ప్రభుత్వానికి, మావోరీకి మధ్య సంబంధాలకు మార్గనిర్దేశం చేసే 1840 నాటి వెయిటాంగి ఒప్పందంలో పేర్కొన్న సూత్రాల ప్రకారం, బ్రిటీష్ వారికి పాలనను అప్పగించినందుకు ప్రతిఫలంగా గిరిజనులు తమ భూములను నిలుపుకోవడానికి, వారి ప్రయోజనాలను కాపాడుకోవడానికి విస్తృత హక్కులను వాగ్దానం చేశారు. ఆ హక్కులు న్యూజిలాండ్ ప్రజలందరికీ వర్తింపజేయాలని ఈ బిల్లులో పేర్కొన్నారు.
ఎంపీ హనా రహితి కరేరికి మైపీ క్లార్క్ ఎవరు?
హనా రవతి కరేరికి మైపీ క్లార్క్ న్యూజిలాండ్ కు చెందిన 22 ఏళ్ల ఎంపీ. ఆమె టె పాటి మావోరీకి పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపు రెండు వందల ఏళ్లలో సభలో అతి పిన్న వయస్కురాలైన సిట్టింగ్ ఎంపీగా ఆమె రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్ లో 2023లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించారు. పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించారు. మావోరీ హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్, ఆయన కన్జర్వేటివ్ ప్రభుత్వంపై మైపీ-క్లార్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల ప్రధాని లక్సన్ ప్రజాదరణ గణనీయంగా క్షీణించింది. దాంతో, న్యూజీలాండ్ ప్రజల ఐదుగురు ప్రత్యామ్నాయ ప్రధానమంత్రుల అభ్యర్థుల జాబితాలో మైపి-క్లార్క్ కూడా స్థానం సంపాదించారని టైమ్ మ్యాగజైన్ నివేదించింది.