భారత దేశ 52వ సీజేఐగా జస్టీస్​ బీఆర్​ గవాయ్​ ప్రమాణం-meet justice br gavai the second dalit cji who took oath today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భారత దేశ 52వ సీజేఐగా జస్టీస్​ బీఆర్​ గవాయ్​ ప్రమాణం

భారత దేశ 52వ సీజేఐగా జస్టీస్​ బీఆర్​ గవాయ్​ ప్రమాణం

Sharath Chitturi HT Telugu

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ గవాయ్​ ప్రమాణం చేశారు. దళిత సామాజికవర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తిగా నిలిచారు జస్టిస్ గవాయ్.

జస్టిస్​ గవాయ్​ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి (@PresidentOfIndia)

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 2025 నవంబర్​ వరకు, అంటే ఆరు నెలల పాటు సీజేఐగా పనిచేయనున్నారు జస్టిస్​ గవాయ్.

సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా మంగళవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ గవాయ్ బాధ్యతలు చేపట్టారు.

దళిత సామాజికవర్గం నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన రెండో వ్యక్తి జస్టిస్ గవాయ్. ఆయన కంటే ముందు మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ 2007లో తొలి దళిత సీజేఐ అయ్యారు.

ఆర్కిటెక్ట్ కావాలనుకుని..

జస్టిస్ గవాయ్ 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించారు. బీకామ్​ పట్టా పొందిన జస్టిస్ గవాయ్ అమరావతి విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. చీఫ్ జస్టిస్​గా నియమితులైన ఆయన ఆర్కిటెక్ట్ కావాలనుకున్న విషయం చాలా మందికి తెలియదు. కానీ, తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ఆయన న్యాయవాదిగా మారారు.

జస్టిస్ గవాయ్ తండ్రి రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ సుప్రసిద్ధ అంబేడ్కరిస్ట్​ నాయకుడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు. గవాయ్​ అనుచరులు, అభిమానులు ఆయన్ని దాదాసాహెబ్ అని ఆప్యాయంగా పిలిచేవారు.

2006 నుంచి 2011 వరకు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి నుంచి లోక్​సభకు ఎన్నికైన రామకృష్ణ గవాయ్.. బిహార్, సిక్కిం, కేరళ రాష్ట్రాలకు గవర్నర్​గా పనిచేశారు.

కుమారుడు భూషణ్ రామకృష్ణ గవాయ్ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందడానికి నాలుగు సంవత్సరాల ముందు, రామకృష్ణ సూర్యభాన్ గవాయ్ 2015లో మరణించారు.

ఇక 25 సంవత్సరాల వయస్సులో జస్టిస్​ గవాయ్​ 1985 మార్చి 16న బార్​లో చేరారు. 1987 నుంచి 1990 వరకు బాంబే హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో ఉన్న ప్రొఫైల్ ప్రకారం బాంబే హైకోర్టు నాగ్​పూర్ బెంచ్​లో ప్రాక్టీస్ చేశారు.

జస్టిస్​ బీఆర్​ గవాయ్ 2005 నవంబర్​ 12న బాంబే హైకోర్టు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. అక్కడి నుంచి భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 16 సంవత్సరాలు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తరువాత 2019 మే 24న సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లారు.

సుప్రీంకోర్టులో సంవత్సరాలు..

ప్రధాన న్యాయమూర్తి కావడానికి ముందు సుప్రీంకోర్టులో పనిచేసిన సమయంలో, జస్టిస్ బీఆర్ గవాయ్ రాజ్యాంగ, పరిపాలనా చట్టం, సివిల్ చట్టం, క్రిమినల్ చట్టం, వాణిజ్య వివాదాలు, మధ్యవర్తిత్వ చట్టం వంటి అంశాలను పరిష్కరించే సుమారు 700 బెంచ్​లలో భాగంగా ఉన్నారు.

పౌరుల ప్రాథమిక హక్కులు, మానవ హక్కులు, చట్టపరమైన హక్కులను పరిరక్షించే వివిధ అంశాలపై రాజ్యాంగ ధర్మాసనం తీర్పులతో సహా జస్టిస్ గవాయ్ సుమారు 300 తీర్పులు రాశారు.

జస్టిస్​ బీఆర్​ గవాయ్​ కీలక తీర్పులు..

ఎలక్టోరల్ బాండ్లకు ఆర్టికల్ 370

జస్టిస్ గవాయ్ అత్యంత కీలకమైన రాజకీయ కేసుల్లో తన తీర్పులకు ప్రసిద్ధి చెందారు. తరచుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషనర్​కి ఉపశమనం కల్పిస్తారని అంటూ ఉంటారు.

న్యూస్​క్లిక్​ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా చారిత్రాత్మక తీర్పుల్లో, జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ), మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎఏ) వంటి కఠినమైన చట్టాలలో ఏకపక్ష అరెస్టులకు వ్యతిరేకంగా విధానపరమైన రక్షణలను ఏర్పాటు చేసింది.

సరైన ప్రక్రియను పాటించకుండా పౌరుల ఆస్తులను కూల్చివేయడం చట్ట విరుద్ధం అని 2024 నవంబర్​లో ఆయన నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

గత ఏడాది ఫిబ్రవరిలో ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ సభ్యుడిగా ఉన్నారు. జమ్మూకశ్మీర్​కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడాన్ని సమర్థించిన మరో రాజ్యాంగ ధర్మాసనంలో (2023 డిసెంబర్​లో) కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు.

వీటితో పాటు జస్టిస్ గవాయ్ 2016లో యూనియన్ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూ మెజారిటీ అభిప్రాయాన్ని రాశారు.

రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం కేసు..

రాహుల్​ గాంధీ పరువు నష్టం కేసు విచారణలో, 2023 జులైలో జస్టిస్ గవాయ్ కాంగ్రెస్​తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తూ విచారణ నుంచి తప్పుకోవడానికి ముందుకొచ్చారు.

'నా వైపు నుంచి కొంత ఇబ్బంది ఉంది. మా నాన్న కాంగ్రెస్ సభ్యుడు కానప్పటికీ, ఆయన కాంగ్రెస్​తో అనుబంధం కలిగి ఉన్నారు. చాలా సన్నిహితంగా ఉన్నారు. 40 ఏళ్లకు పైగా.. కాంగ్రెస్ మద్దతుతో పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఉన్నారు. నా సోదరుడు ఇప్పటికీ రాజకీయాల్లోనే ఉన్నారు," అని కాంగ్రెస్​తో అనుబంధాన్ని చెప్పారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఆయనను తప్పించాలని కోరలేదు. చివరకు ఆ శిక్షపై స్టే విధించడంతో రాహుల్ గాంధీ తిరిగి లోక్​సభకు వచ్చేందుకు మార్గం సుగమమైంది.

జస్టిస్ గవాయ్ సోదరుడు డాక్టర్ రాజేంద్ర గవాయ్ 2019 లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఏ) అధ్యక్షుడు రాందాస్ అథవాలేతో చేతులు కలిపి అసలు ఆర్పీఐలోని వివిధ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే, గవాయ్ నేతృత్వంలోని వర్గం కాంగ్రెస్​తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోగా, అథవాలే నేతృత్వంలోని వర్గం బీజేపీతో జతకట్టింది.

ఇప్పుడు వక్ఫ్ చట్టానికి వివాదాస్పద సవరణలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టనుంది. మే 15న జస్టిస్ గవాయ్ విచారించనున్న తొలి కేసుల్లో ఇది ఒకటి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.