Matthew Perry death : ‘ఫ్రెండ్స్​’ యాక్టర్​ మాథ్యూ పెర్రీని వైద్యులు- సహాయకుడే చంపేశారా?-matthew perry was allegedly killed by his aide and doctors disturbing texts emerge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Matthew Perry Death : ‘ఫ్రెండ్స్​’ యాక్టర్​ మాథ్యూ పెర్రీని వైద్యులు- సహాయకుడే చంపేశారా?

Matthew Perry death : ‘ఫ్రెండ్స్​’ యాక్టర్​ మాథ్యూ పెర్రీని వైద్యులు- సహాయకుడే చంపేశారా?

Sharath Chitturi HT Telugu

Matthew Perry death : ప్రముఖ టీవీ సిరీస్​ ‘ఫ్రెండ్స్​’ నటుడు మాథ్యూ పెర్రీ మరణంపై సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆయనకున్న డ్రగ్​ అడిక్షన్​ని తమకు ప్రయోజనకరంగా మార్చుకుని, కొందరు మాథ్యూకి అధిక మొత్తంలో 'కేటమైన్​' ఇచ్చారు. కేటమైన్​ ఓవర్​డోస్​తో ఆయన మరణించారు. ఈ కేసులో పోలీసులు ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

మాథ్యూ పెర్రీ మరణం వెనుక షాకింగ్​ విషయాలు..! (AFP)

ప్రముఖ అమెరికన్​ టీవీ సిట్​కామ్​ సిరీస్​ 'ఫ్రెండ్స్​' యాక్టర్​ మాథ్యూ పెర్రీ మరణంపై తాజాగా పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. మాథ్యూ పెర్రీకి ఉన్న డ్రగ్​ అడిక్షన్​తో ‘ప్రయోజనం’ పొందేందుకు కొందరు ప్రయత్నించారని అధికారులు తాజాగా చెప్పారు. ఈ మేరకు ఇద్దరు వైద్యులు, ఒక సహాయకుడితో సహా మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

మాథ్యూ పెర్రీ మరణం చుట్టూ వివాదం..

ఎన్నో ఏళ్లుగా డ్రగ్​ అడిక్షన్​తో సతమతమవుతూ, లాస్​ ఏంజెల్స్​లోని తన నివాసంలో మాథ్యూ పెర్రీ గతేడాది అనుమానాస్పద రీతిలో మరణించారు. ఆయన మృతదేహం బాత్​ టబ్​లో మునిగిపోయి కనిపించింది. ఈ వార్త ప్రపంచ వినోద రంగం, ఫ్రెండ్స్​ సిరీస్​ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. కంట్రోల్డ్​ డ్రగ్​ కేటమైన్​ ప్రభావం కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారని పోస్టుమార్టంలో తేలింది. దీనిపై అధికారులు ఇంతకాలం విచారణ చేపట్టి, ఐదుగురిని అరెస్ట్​ చేశారు.

డ్రగ్స్ నుంచి బయటపడేందుకు తన వైద్యులు సాయం చేయకపోవడంతో కొత్తగా ఇద్దరు వైద్యులతో ఈ ఫ్రెండ్స్​ యాక్టర్​కి పరిచయమైంది. చికిత్సలో భాగంగా వైద్యులు మాథ్యూ పెర్రీకి కేటమైన్​ని సిఫార్సు చేశారు. పెర్రీ దానికి కూడా బానిసయ్యారు! ఈ ఇద్దరు వైద్యుల ద్వారా 'కేటమైన్​ క్వీన్​'గా పిలిచే 41ఏళ్ల జస్వీన్​ సంఘతో మాథ్యూకి పరిచయం ఏర్పడింది. డిప్రెషన్​తో ఉన్న తనకు సాయం చేయాలని వారిని పెర్రీ అభ్యర్థించారు. కానీ ఆయన పరిస్థితిని వాళ్లు పూర్తిగా వినియోగించుకుని, లబ్ధిపొందాలని చూశారు.

"మాథ్యూ పెర్రీ డ్రగ్​ అడిక్షన్​ని ఈ ఐదుగురు తమకు ప్రయోజనకరంగా మార్చుకున్నారు. చేస్తున్నది తప్పు అని తెలిసినా, కొన్ని పనులు చేశారు. తాము చేస్తున్నది మాథ్యూ పెర్రీ జీవితానికి రిస్క్​ అని తెలిసినా వారు ఆగలేదు," అని యూఎస్​ అటార్నీ మార్టిన్​ ఎస్ట్రాడా తెలిపారు.

"ఈ మోరాన్​ (మూర్ఖుడు) ఎంత వరకు డబ్బులు ఇవ్వగలడో చూద్దాము," అని ఇద్దరు వైద్యుల్లో ఒకరు పంపిన మెసేజ్​లు కీలక ఆధారంగా మారాయి. అంతేకాదు.. ఓ సందర్భంలో 12 డాలర్లు విలువ చేసే కేటమైన్​ వెయిల్​ని మాథ్యూ పెర్రీకి 2000 డాలర్లకు విక్రయించినట్టు ఆధారాలు బయటపడ్డాయి.

అరెస్ట్​ అయిన ఐదుగురిలో ఒక డాక్టర్​ సాల్వేడార్​ ప్లాసెన్షియాకి 120ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అటార్నీ వివరించారు.

సహాయకుడే మోసం చేశాడు..!

కెన్నెత్​ ఇవామస అనే వ్యక్తి మాథ్యూ పెర్రీ దగ్గర దాదాపు 20ఏళ్ల పాటు సహాయకుడిగా పనిచేస్తున్నాడు. బాత్​టబ్​లో పడి, మాథ్యూ మరణించిన రోజున ఇతనే తొలుత పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అయితే కెన్నెత్​ని విచారించగా తాను తప్పు చేసినట్టు కెన్నెత్​ ఒప్పుకున్నాడని సమాచారం. కేటమైన్​ క్వీన్​ నుంచి ఎరిక్​ ఫ్లెమింగ్​ అనే డ్రగ్​ డీలర్​ ద్వారా కేటమైన్​ని అధిక మొత్తంలో కొని మాథ్యూ పెర్రీకి ఇచ్చినట్టు పోలీసులకు అతను చెప్పాడని సమాచారం.

తాజా ఆరోపణల ప్రకారం.. ఎలాంటి వైద్య కారణాలు లేకుండా సాల్వెడార్​ అనే వైద్యుడు కెన్నెత్​ ద్వారా మాథ్యూ పెర్రీకి కనీసం 7సార్లు కేటమైన్​ని ఇచ్చాడు.

థ్యూ పెర్రీ పోస్టుమార్ట్​ నివేదిక ప్రకారం.. ఆయన కడుపులో కేటమైన్​ తక్కువ మోతాదులోనే కనిపించింది. కానీ ఆయన రక్తంలో చాలా పర్సెంట్​ కేటమైన్​ ఉంది.

ఫ్రెండ్స్​లో ఐకానిక్​ ‘ఛాండ్లర్​’ రోల్​ ప్లే చేసిన మాథ్యూ పెర్రీ.. వినోద ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మరణం నాటికి ఆయన వయస్సు 54ఏళ్లు మాత్రమే!

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.