nupur sharma | ముంబై, ఢిల్లీల్లో పెద్ద ఎత్తున‌ నిర‌స‌న‌లు-massive protest at delhi s jama masjid over remarks against prophet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Massive Protest At Delhi's Jama Masjid Over Remarks Against Prophet

nupur sharma | ముంబై, ఢిల్లీల్లో పెద్ద ఎత్తున‌ నిర‌స‌న‌లు

HT Telugu Desk HT Telugu
Jun 10, 2022 03:07 PM IST

మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అనుచిత వ్యాఖ్య‌ల ప‌ర్య‌వ‌సానాలు కొన‌సాగుతున్నాయి. బీజేపీ నాయ‌కులు నుపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ చేసిన ఆ వ్యాఖ్య‌ల‌పై అంత‌ర్జాతీయంగా తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల అనంత‌రం దేశ‌వ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు.

ఢిల్లీలో జామియా మ‌సీదు వెలుపల నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న
ఢిల్లీలో జామియా మ‌సీదు వెలుపల నిర‌స‌న‌ ప్ర‌ద‌ర్శ‌న

మొహమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌ను అవ‌మానిస్తూ బీజేపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లపై దేశీయంగా, అంత‌ర్జాతీయంగా ముస్లింలు తీవ్రంగా మండిప‌డ్తున్నారు. ఆ వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌ని, పార్టీకి, ప్ర‌భుత్వానికి వాటితో సంబంధం లేద‌ని బీజేపీ ఇచ్చిన వివ‌ర‌ణ కూడా వారిని సంతృప్తి ప‌ర్చ‌లేదు. ప్ర‌వ‌క్త‌పై అభ్యంత‌ర‌క‌ర కామెంట్లు చేసిన నుపుర్ శ‌ర్మ‌ను బీజేపీ పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. న‌వీన్ జిందాల్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది. త‌న వ్యాఖ్య‌ల‌కు నుపుర్ శ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. అయినా, వారి వ్యాఖ్య‌ల ప్ర‌తికూల ప్ర‌భావం పార్టీ, ప్ర‌భుత్వంపై ప‌డుతూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల త‌రువాత‌..

మొహమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్య‌ల‌ను వ్య‌తిరేకిస్తూ శుక్ర‌వారం దేశ‌వ్యాప్తంగా ముస్లింలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హించారు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల అనంత‌రం ప్ర‌భుత్వ‌, బీజేపీ వ్య‌తిరేక నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వ‌హించారు. ముఖ్యంగా, ఢిల్లీ, కోల్‌క‌తాల్లో ఈ నిర‌స‌న‌ల్లో భారీ సంఖ్య‌లో ముస్లింలు పాల్గొన్నారు. యూపీలోని ప‌లు న‌గ‌రాల్లోనూ పెద్ద ఎత్తున నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి. ఢిల్లీలో జామియా మ‌సీదు వెలుపల ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించిన ముస్లింలు.. త‌క్ష‌ణ‌మే నుపుర్ శ‌ర్మ‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ నిర‌స‌న స్వ‌చ్ఛంధంగా జ‌రిగింద‌ని, మ‌సీదు ఎలాంటి నిర‌స‌న‌ల‌కు పిలుపునివ్వ‌లేద‌ని జామియా మ‌సీదు షాహీ ఇమామ్ వెల్ల‌డించారు. నిర‌స‌న‌ల్లో పాల్గొన్న‌ది ఎంఐఎం లేదా ఓవైసీ మ‌ద్దతుదారులు కావ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు.

వివాదం ఎలా మొద‌లైంది?

యూపీలోని కాన్పూర్‌లో గ‌త‌వారం స్వ‌ల్ప స్థాయిలో మ‌త ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. అంత‌కుముందు జ్ఞాన్‌వాపీ మ‌సీదు వివాదం కొన‌సాగుతోంది. దీనిపై జ‌రిగిన ఒక టీవీ డిబేట్‌లో పాల్గొన్న బీజేపీ నేత నుపుర్ శ‌ర్మ.. జ్క్షాన‌వాపీ మ‌సీదులో ల‌భ్య‌మైన‌ట్లు భావిస్తున్న శివ‌లింగాన్ని ముస్లింలు అవ‌మానిస్తున్నార‌ని, అది ఫౌంటెయిన్ అని అవ‌హేళ‌న చేస్తున్నార‌ని వాదిస్తూ.. మొహమ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. మ‌రో బీజేపీ నేత న‌వీన్ జిందాల్ మొహ‌మ్మ‌ద్‌పై అనుచిత వ్యాఖ్య‌ల‌తో ఒక ట్వీట్ చేశారు. కాసేప‌టికి ఆ ట్వీట్‌ను తొల‌గించారు. వీటిపై ఒక్క‌సారిగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. అంత‌ర్జాతీయంగా కూడా దాదాపు 15 దేశాలు ఈ వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించాయి. నుపుర్ శ‌ర్మ ఢిల్లీ యూనివ‌ర్సిటీ విద్యార్థి సంఘం ప్రెసిడెంట్‌గా ప‌నిచేశారు. త‌రువాత న్యాయ‌వాద వృత్తి చేప‌ట్టారు. 2015 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆప్ నేత అర‌వింద్ కేజ్రీవాల్‌పై పోటీ చేసి ఓడిపోయారు. స‌స్పెండ్ కావ‌డానికి ముందు ఆమె బీజేపీ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు.

IPL_Entry_Point

టాపిక్