Mahakumbh Fire Accident : మహా కుంభమేళాలో పేలిన గ్యాస్ సిలిండర్.. పెద్ద ఎత్తున మంటలు
Mahkumbh Fire Accident : మహా కుంభమేళాలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. కోట్ల సంఖ్యలో భక్తులు ఈ వేడుకకు తరలివస్తున్నారు. అయితే తాజాగా ఇక్కడ గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాణనష్టం జరిగినట్లుగా ప్రస్తుతానికి సమాచారం లేదు.

మహా కుంభమేళా టెంట్ సిటీలోని సెక్టార్ 19లో మంటలు చెలరేగాయి. వంట సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. దాదాపు 15 నుంచి 18 టెంట్లు దగ్ధమయ్యాయి. 'మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి.' అని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు.
గీతా ప్రెస్ టెంట్‌లో సెక్టార్ 19లో సాయంత్రం 4.30 గంటలకు మంటలు చెలరేగాయని ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ ఏఎన్ఐకి వెల్లడించారు. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని, పరిస్థితి అదుపులో ఉందని ఆయన చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి కూడా మహ కుంభమేళాలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసిందని అధికారులు అన్నారు. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలంలో ఉన్నారని సీఎంఓ అధికారులు వెల్లడించారు.
'సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా2025లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తెచ్చాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు అక్కడే ఉన్నారు.' అని సీఎంఓ తెలిపింది.
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. ఇతర అత్యవసర సేవల కోసం కూడా అగ్నిప్రమాదం వైపు అధికారులను పంపించారు. 'గీతా ప్రెస్ టెంట్‌లలో మంటలు చెలరేగాయి. ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టంపై సర్వే నిర్వహిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. గుడారాలు, కొన్ని వస్తువులు మాత్రమే కాలిపోయాయి.' అని డీఐజీ వైభవ్ కృష్ణ వెల్లడించారు.