Stabbings in London: లండన్ లో కత్తితో దుండగుడి వీరంగం; పలువురికి గాయాలు
Stabbings in London: లండన్ లో ఒక వ్యక్తి కత్తితో విచ్చలవిడిగా దాడి చేస్తూ భయాందోళనలు సృష్టించాడు. విచక్షణారహితంగా అతడు చేసిన దాడిలో ఇద్దరు పోలీసులు సహా పలువురు గాయపడ్డారు. ఎట్టకేలకు పోలీసులు అతడిని బంధించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడి వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం లేదని పోలీసులు భావిస్తున్నారు.
Stabbings in London: ఈశాన్య లండన్ లోని హైనాట్ ట్యూబ్ స్టేషన్ సమీపంలోని థర్లో గార్డెన్స్ లో ఓ వ్యక్తి కత్తితో ప్రజలపై, పోలీసు అధికారులపై దాడి చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. పసుపురంగు పుల్ ఓవర్ ధరించి, కత్తితో వచ్చిన ఆ వ్యక్తి థర్లో గార్డెన్స్ లోని ఓ ఇంట్లోకి వాహనంతో దూసుకు వెళ్లి పలువురిని కత్తితో పొడిచాడు. 36 ఏళ్ల నిందితుడు పలువురు వ్యక్తులపై, ఇద్దరు పోలీసు అధికారులపై దాడి చేసి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ ఘటనను ఉగ్రవాదానికి సంబంధించినదిగా పరిగణించడం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఇంట్లోకి వాహనంతో దూసుకువెళ్లి.
ఈ ఉదయం 7 గంటల సమయంలో లండన్ మెట్రోపాలిటన్ పోలీసులకు ఈ సంఘటన గురించి సమాచారం అందింది. ఈశాన్య లండన్ లోని హైనాట్ ట్యూబ్ స్టేషన్ సమీపంలోని థర్లో గార్డెన్స్ లో దుండగుడు తన వాహనంలో ఒక ఇంట్లోకి దూసుకువెళ్లి, అక్కడి వారిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పలు అంబులెన్స్ లతో సహా ఎమర్జెన్సీ సర్వీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కత్తి దాడితో గాయాల పాలైన వారిని, భయాందోళనలకు గురైన వృద్ధులను వెంటనే ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రుల ప్రస్తుత పరిస్థితి ఏమిటనేది పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ఒక్కడేనా?.. ఇంకా ఉన్నారా?
ఈ దాడికి ప్లాన్ చేసింది, దాడిలో పాల్గొన్నది ఒక్క వ్యక్తేనా? లేక ఈ దాడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదనపు అనుమానితుల కోసం నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి, భయాందోళనలకు గురవుతున్నారని డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ అడె అడెలెకాన్ అన్నారు. క్షతగాత్రులు ఈ దాడిలో షాక్ కు గురయ్యారన్నారు. ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, వీలైనంత త్వరగా మరింత సమాచారం అందిస్తామని చెప్పారు. ఈ ఘటన ఉగ్రవాదానికి సంబంధించినదిగా కనిపించడం లేదన్నారు.
బ్రిటన్ ప్రభుత్వ స్పందన
ఈ అనూహ్య ఘటనపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నట్లు బ్రిటన్ హోంశాఖ కార్యదర్శి జేమ్స్ క్లెవర్లీ తెలిపారు. ‘ఈ ఉదయం హైనాట్ స్టేషన్ లో జరిగిన సంఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నాను’ అని ఆయన ఎక్స్ లో రాశారు. ఈ ఘటన నేపథ్యంలో ఇల్ ఫోర్డ్ లోని హైనాట్ ట్యూబ్ స్టేషన్ ను పోలీసులు కొంత సమయం మూసివేశారు. కాగా, దుండగుడు కత్తితో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.