న్యూ ఇయర్ వేళ అమెరికాలో వరుస సంఘటనలు.. నైట్‌క్లబ్‌లో తాజాగా కాల్పుల కలకలం
New York : న్యూ ఇయర్ వేళ అమెరికాలో వరుస సంఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇప్పటికే ట్రక్కు ఘటనలో 15 మంది మరణించారు. తాజాగా నైట్ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో కొందరు గాయపడ్డారు.
అమెరికాలో కొత్త సంవత్సరం వేళ పలు సంఘటనలు భయపెట్టిస్తున్నాయి. ట్రక్కు బీభత్సం, బాంబు పేలుడు, తాజాగా కాల్పుల కలకలం జరిగింది. న్యూయర్క్‌లోని క్వీన్స్ కౌంటీకి చెందిన అమజురా నైట్‌క్లబ్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు 11 మంది వరకు గాయపడ్డారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. స్థానికులు, మీడియా సోషల్ మీడియా పోస్ట్‌లు చూస్తే క్లబ్ వద్ద భారీగా పోలీసులు చేరినట్టుగా కనిపిస్తుంది.
కాల్పుల్లో గాయపడ్డ బాధితులను లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ హాస్పిటల్, కోహెన్ చిల్డ్రన్స్ మెడికల్ సెంటర్‌తో సహా స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన వెనక సూత్రధారులు ఎవరని పోలీసులు విచారణ చేస్తున్నారు.
ట్రక్కుతో బీభత్సం
అమెరికాలోని న్యూ ఆర్లీన్స్‌లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ట్రక్కుతో జరిగిన దాడిలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను అమెరికా తీవ్రవాద దాడిగా పరిగణిస్తోంది. దాడి చేసిన షంషుద్దీన్ జబ్బార్‌పై ఎఫ్‌బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనకు మరికొందరు కూడా బాధ్యులుగా ఉండవచ్చని FBI భావిస్తోంది.
ట్రక్కులో దాడి చేసిన వ్యక్తిని 42 ఏళ్ల షంషుద్దీన్ జబ్బార్‌గా గుర్తించారు. అతను టెక్సాస్‌కు చెందినవాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్. జబ్బార్ యూఎస్ ఆర్మీలో కూడా పనిచేశాడు. అతడిపై 2002లో దొంగతనం, 2005లో అక్రమ లైసెన్స్ వినియోగం వంటి కేసులు నమోదయ్యాయి. రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. 2022 లో తన రెండో భార్య నుండి కూడా విడాకులు తీసుకున్నాడు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా న్యూ ఆర్లీన్‌లోని ఫ్రెంచ్ క్వార్టర్‌లో 3:15 గంటలకు ట్రక్కుతో దాడి చేశాడు. దీంట్లో 15 మంది వరకు మరణించారు. దాడి తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో అతను మరణించాడు. ఎన్‌కౌంటర్ తర్వాత ఒక తుపాకీ, రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఐఎస్ఐఎస్ జెండా కూడా వాహనంలో లభ్యమైంది. జబ్బర్‌ను లోన్ ఉల్ఫ్‌గా భావిస్తున్నారు. అంటే ఉగ్రవాద సంస్థ నుంచి ప్రేరేపితమైన చిన్న గ్రూపు లేదా ఒంటరి వ్యక్తి.
కారులో పేలుడు
మరోవైపు ఇటీవలే ఓ పేలుడు ఘటన కూడా సంభవించింది. డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ బయట టెస్లా కారులో పేలుడు జరిగింది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఇలా న్యూ ఇయర్ వేళ అమెరికాలో వరుస సంఘటనలు భయపట్టేలా చేస్తున్నాయి.