Sri Lanka New President : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిస్సానాయకే
Anura Kumara Dissanayake : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నాయకుడు అనుర కుమార దిస్సానాయకే ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 42.31 శాతం ఓట్లతో పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్‌కు చెందిన 55 ఏళ్ల అనూర కుమార దిస్సానాయకే అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు.
ఆదివారం ప్రకటించిన ఫలితాల ప్రకారం.. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సానాయకే విజయం సాధించారు. అధ్యక్ష ఎన్నికల్లో 42.31 శాతం ఓట్లతో అధ్యక్ష పదవి సొంతం చేసుకున్నారు. వామపక్ష కూటమి అయిన పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్(జేవీపీ)కి చెందిన 55 ఏళ్ల అనుర కుమార విజయం సాధించినట్లు ప్రకటించారు.
కొలంబోలోని కలోనియల్ యుగం ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్‌లో సోమవారం దిస్సానాయకే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2019 అధ్యక్ష ఎన్నికలలో కేవలం 3 శాతం కంటే ఎక్కువ ఓట్లను పొందిన జేవీపీకి ఈ విజయం పెద్ద మలుపు. శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో 76 శాతం ఓటింగ్ నమోదైంది.
ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస 32.76 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. రణిల్ విక్రమసింఘే 17.27 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. 2022 ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థి విజయం మెుదటి రౌండ్‌లో తేలకుండా రెండో రౌండ్‌కి చేరుకోవడం ఇదే తొలిసారి. మెుదటి రౌండ్‌లో ఏ అభ్యర్థికి కూడా 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపునకు వెళ్లాల్సి వచ్చింది.
శ్రీలంక బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కారణంగా విక్రమసింఘే నాయకత్వంపై ఈ ఎన్నికలు చాలా సీరియస్‌గా జరిగాయి. శ్రీలంకలో రాజకీయంగా బలంగా ఉన్న రాజపక్స కుటుంబంపై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు. పార్లమెంటులో 20 ఏళ్లుగా ఉన్న అనుర కుమార వైపు ఆసక్తి చూపించారు. 17 మిలియన్ల అర్హత కలిగిన ఓటర్లలో 75 శాతం మంది పాల్గొన్నారు.
శ్రీలంకలో మొత్తం అధ్యక్ష ఎన్నికల్లో ఆర్థిక అంశాలే ఆధిపత్యం చెలాయించాయి. రెండేళ్ల క్రితం ఆర్థికంగా అత్యంత దారుణమైన దశను ఎదుర్కొన్న శ్రీలంక ఎన్నికల అంశంగా దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చింది. ఐఎంఎఫ్ తో ఒప్పందంపై దిస్సానాయకే పార్టీ మాట్లాడుతూ.. తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించబోమని, అయితే దీనిపై కచ్చితంగా చర్చిస్తామని చెప్పారు.
దిస్సానాయకే ఎక్స్‌లో పోస్ట్ చేసి ఈ విజయం మనందరిది అని రాశారు. ఏళ్ల తరబడి ఆర్థిక సవాళ్లు, ఆ తర్వాత రాజకీయ అనిశ్చితి తర్వాత శ్రీలంకలో జరిగిన తొలి ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన దిస్సానాయకేకు ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రజల నుంచి మద్దతు లభించింది.
శనివారం ఓటింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ, అధికారులు ఆదివారం మధ్యాహ్నం వరకు ముందుజాగ్రత్తగా దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. పెద్దఎత్తున సంఘటనలు చోటు చేసుకోనప్పటికీ వేలాది మంది పోలీసులను బందోబస్తు ఏర్పాటు చేశారు. తుది ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు లేదా బహిరంగ వేడుకలపై నిషేధం వారం రోజుల పాటు అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు.
టాపిక్