Manmohan Singh : ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్​ సింగ్​ అంత్యక్రియలు-manmohan singh funeral live updates ex pm cremation in nigam bodh ghat ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manmohan Singh : ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్​ సింగ్​ అంత్యక్రియలు

Manmohan Singh : ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్​ సింగ్​ అంత్యక్రియలు

Sharath Chitturi HT Telugu
Dec 28, 2024 03:10 PM IST

Manmohan Singh death : దిల్లీలోని నిగమ్​బోధ్​ ఘాట్​లో మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ అంత్యక్రియలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్​ నేతలు నిగమ్​బోధ్​ ఘాట్​కు వెళ్లి మన్మోహన్​ సింగ్​కి నివాళులర్పించారు.

దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్​ సింగ్​ పార్థివదేహం
దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్​ సింగ్​ పార్థివదేహం (PTI)

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​కి భారత దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. దిల్లీలోని నిగమ్​బోధ్​ ఘాట్​లో మన్మోహన్​ సింగ్​ పార్థివ దేహానికి శనివారం ఉదయం అంత్యక్రియలు పూర్తయ్యాయి. మన్మోహన్​ సింగ్​ కుమార్తె, ఆయన చితికి నిప్పంటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్​ నేతలు నిగమ్​బోధ్​ ఘాట్​కు వెళ్లి మన్మోహన్​ సింగ్​కి నివాళులర్పించారు. దేశానికి మన్మోహన్​ సింగ్​ చేసిన సేవలను స్మరించుకున్నారు.

yearly horoscope entry point

కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలో..

అంతకుముందు.. మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి తరలించారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సహా అనేక మంది కాంగ్రెస్​ సీనియర్​ నేతలు మన్మోహన్​ సింగ్​కి నివాళులర్పించారు. పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు, ప్రముఖ నేతలు సైతం దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయానికి వెళ్లి మన్మోహన్​ సింగ్​ పార్థివ దేహానికి నివాళులర్పించారు.

అనంతరం కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయం నుంచి నిగమ్​బోధ్​ ఘాట్​ వరకు మన్మోహన్​ సింగ్​ అంతిమ యాత్ర సాగింది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇక నిగమ్​ ఘాట్​లో మన్మోహన్​ సింగ్​ పార్థివ దేహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, ఉపాధ్యక్షుడు జగదీప్​ దన్​ఖడ్​ వంటి వారు నివాళులర్పించారు. సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు ఇతర కాంగ్రెస్​ నేతలు సైతం మన్మోహన్​ సింగ్​కి అంజలి ఘటించారు.

స్మారక చిహ్నంపై వివాదం..!

మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వారసత్వాన్ని గౌరవిస్తూ స్మారక చిహ్నాన్ని నిర్మించే ప్రదేశంలోనే అంత్యక్రియలు నిర్వహించాలని కాంగ్రెస్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కోరింది. నిగంబోధ్ ఘాట్​లో సింగ్ అంత్యక్రియలు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శించింది. సింగ్ అంత్యక్రియలు, స్మారక చిహ్నానికి స్థలం కనుగొనకపోవడం దేశ మొదటి సిక్కు ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించడమేనని మండిపడింది. “వాజ్​పేయి స్మారక చిహ్నానికి స్థలం కేటాయించినప్పుడు, మన్మోహన్​ సింగ్​కి ఎందుకు కేటాయించరు?” అని ఆరోపణలు చేసింది.

కాంగ్రెస్​ విమర్శలపై కేంద్రం స్పందించింది. మాజీ ప్రధాని, దివంగత మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ ఏ) శుక్రవారం తెలిపింది. కానీ ఆ స్థలం ఎక్కడ ఉంటుంది? అన్నది ఇంకా స్పష్టం చేయలేదు. అయితే స్మారక చిహ్నం కోసం ట్రస్టును ఏర్పాటు చేసి దానికి స్థలం కేటాయించాల్సి ఉన్నందున దహన సంస్కారాలు, ఇతర లాంఛనాలు జరుగుతాయని తెలిపింది.

"మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 28, 2024 ఉదయం 11:45 గంటలకు దిల్లీలోని నిగంబోధ్ ఘాట్​లో అంత్యక్రియలు జరుగుతాయి," అని ఎంహెచ్ఏ శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.