Manmohan Singh : ఆ ఒక్క ‘ఫోన్​ కాల్​’తో దేశ భవిష్యత్తు మారిపోయింది- 1991లో ఏం జరిగిందంటే..-manmohan singh death how one phone call changed the entire nation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manmohan Singh : ఆ ఒక్క ‘ఫోన్​ కాల్​’తో దేశ భవిష్యత్తు మారిపోయింది- 1991లో ఏం జరిగిందంటే..

Manmohan Singh : ఆ ఒక్క ‘ఫోన్​ కాల్​’తో దేశ భవిష్యత్తు మారిపోయింది- 1991లో ఏం జరిగిందంటే..

Sharath Chitturi HT Telugu
Dec 27, 2024 10:15 AM IST

Manmohan Singh death : 1991లో మన్మోహన్​ సింగ్​కి వచ్చిన ఒక ఫోన్​ కాల్​తో ఆయన జీవితం, కోట్లాది మంది భారతీయుల జీవితం, భారత దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. అంతటి కీలకమైన ఫోన్​ కాల్​ ఏంటి? 1991లో అసలేం జరిగింది? ఇక్కడ తెలుసుకోండి..

మన్మోహన్​ సింగ్​..
మన్మోహన్​ సింగ్​.. (HT_PRINT)

భారత ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ 92ఏళ్ల వయస్సులో గురువారం రాత్రి కన్నుమూశారు. ఒక ప్రధానిగా, ఒక ఆర్థిక మంత్రిగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. అయితే ఒక్క “ఫోన్​ కాల్”​ ఆయన జీవితాన్ని, కోట్లాది మంది భారతీయుల జీవితాలను, భారత దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఆ ఫోన్​ కాల్​ వల్లే ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ.. అగ్రదేశాలకు బలమైన పోటీనిస్తూ ఎదుగుతోంది. అసలేంటి ఆ ఫోన్​ కాల్​? అసలేం జరిగింది?

yearly horoscope entry point

ఒక్క ఫోన్​ కాల్​తో మారిపోయిన దేశ భవిష్యత్తు..

ఇది 1991 జూన్​ నాటి సంఘటన! ఆ సమయంలో మన్మోహన్​ సింగ్​ యూజీసీ ఛైర్మన్​గా ఉన్నారు. కాగా, నెథర్​ల్యాండ్స్​లో సమావేశాన్ని ముగించుకుని దిల్లీ తిరిగి వెళ్లారు. ఆ తర్వాత పడుకునేందుకు తన బెడ్​రూమ్​కి వెళ్లారు. అర్థరాత్రి వేళ మన్మోహన్​ సింగ్​ అల్లుడు విజయ్​ థంఖకు ఫోన్​ వచ్చింది. ఆ ఫోన్​ చేసింది పీసీ అలెగ్జ్యాండర్​. అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహా రావుకు ఆయన అత్యంత ఆప్తుడు! మన్మోహన్​ సింగ్​ని లేపాలని, అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలని అలెగ్జ్యాండర్​ థంఖకు చెప్పారు.

కొన్ని గంటల తర్వాత అలెగ్జ్యాండర్​- మన్మోహన్​ సింగ్​ కలుసుకున్నారు. "నరసింహా రావు నిన్ను ఆర్థిక మంత్రి చేయాలని భావిస్తున్నారు," అని అలెగ్జ్యాండర్​ చెప్పారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేని తనకు మంత్రి పదవి ఎందుకు ఇస్తారు అనుకుని ఆయన మాటలను మన్మోహన్​ సింగ్​ సీరియస్​గా తీసుకోలేదు.

కానీ పీవీ నరసింహా రావు ఈ విషయంపై చాలా సీరియస్​గా ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మర్చే శక్తి మన్మోహన్​ సింగ్​కి ఉందని ఆయన విశ్వసించారు. 1991 జనవరి 21న, మన్మోహన్​ సింగ్​ ఎప్పటిలానే ఆఫీస్​కి వెళ్లారు. కానీ ఆయన్ని ఆఫీస్​ నుంచి ఇంటికి పంపించేశారు. "నువ్వు ఆర్థిక మంత్రి అవుతున్నావు. సాయంత్రం జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి రెడీ అవ్వు," అని అధికారులు చెప్పి పంపించేశారు.

"నేను ప్రమాణం చేస్తున్నప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నాకు పోర్ట్​ఫోలియో కేటాయించారు. కానీ నేను ఆర్థిక మంత్రి అవుతానని నరసింహా రావు ముందే చెప్పారు," అని చాలా కాలం తర్వాత మన్మోహన్​ సింగ్​ వెల్లడించారు.

అండ్​ ది రెస్ట్​ ఈజ్​ హిస్టరీ! ఆర్థిక మంత్రిగా మన్మోహన్​ సింగ్​ తీసుకొచ్చిన సంస్కరణల గురించి ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులు గర్వంగా చెప్పుకుంటారు. ప్రపంచంలో అగ్రదేశాలకు ధీటుగా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోందంటే, దానికి మన్మోహన్​ సింగ్​- పీవీ నరసింహ రావు తీసుకున్న బోల్డ్​ నిర్ణయాలు ప్రధాన కారణం.

మన్మోహన్​ సింగ్​ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో కొన్ని..

1991లో నరసింహారావు మైనారిటీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ డిఫాల్ట్​కు చాలా దగ్గరగా ఉంది. విదేశీ మారక నిల్వలు ఒక నెల దిగుమతులకు కూడా సరిపోవు! దేశం తన బంగారు నిల్వలను ఇంగ్లాండుకు రవాణా చేయాల్సిన అవమానాన్ని అనుభవించవలసి వచ్చింది.

మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన ప్రసిద్ధ 1991 బడ్జెట్​తో పాటు పారిశ్రామిక క్రమబద్ధీకరణతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన సంపద సృష్టి చక్రాన్ని ఆవిష్కరించాయి. నియంత్రణ సడలింపులతో దేశీయ బాహ్య మార్కెట్లలో కొత్త అవకాశాలను ఉపయోగించుకోవడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకొచ్చాయి. నిబంధనలను సడలించడంతో ఇన్ఫోసిస్​కి 1990ల ప్రారంభంలో ఐపీఓగా వచ్చే అవకాశం దక్కింది. ఇది భారతదేశ ఈక్విటీ సంస్కృతిని ప్రేరేపించింది. అనంతర కాలంలో భారత ఆర్థిక వ్యవస్థతో పాటు సెంటిమెంట్ బలపడటంతో దేశానికి అనేక విదేశీ పెట్టుబడులు వచ్చాయి. స్టాక్​ మార్కెట్​లు దూసుకెళ్లాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.