Manmohan Singh : ప్రపంచం మెచ్చిన ‘ఆర్థిక మంత్రి’- మన్మోహన్ సింగ్ గురించి మీకు తెలియని 10 విషయాలు..
Manmohan Singh death : 92 ఏళ్ల వయసులో కన్నుమూసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఆర్థికమంత్రిగా, దేశ ప్రధానిగా భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన జీవితం గురించి 10 ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న కన్నుమూశారు. సింగ్ వయసు 92 ఏళ్లు. 1991 నుంచి 1996 వరకు ప్రధాని నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. 1990వ దశకంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. ఇక 2004 నుంచి 2014 వరకు సింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సింగ్ ఎప్పుడూ లోక్‌సభ ఎన్నికల్లో గెలవలేదు! కేంద్ర ఆర్థిక మంత్రి అయిన నాలుగు నెలల తర్వాత 1991 అక్టోబరులో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తొలిసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభలో ఐదుసార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన సింగ్ 2019లో రాజస్థాన్‌కు మారారు.
మాజీ ప్రధాని గురించి మీకు తెలియని 10 విషయాలు..
1-రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో గవర్నర్‌గా పనిచేసిన ఇద్దరు మాత్రమే ఇప్పటివరకు ఆర్థిక మంత్రులు అయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్. మరొకరు సిడి దేశ్‌ముఖ్.
2. నలుగురు ఆర్థికమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. వారు.. మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వీ.పీ.సింగ్, మన్మోహన్ సింగ్
3. నలుగురు దౌత్యవేత్తలు ఆర్థిక మంత్రులుగా నియమితులయ్యారు. వారు హెచ్ఎం పటేల్, సీడీ దేశ్‌ముఖ్, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్.
4. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడగలిగినప్పటికీ, భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఉర్దూలో రాయడం జరిగేది.
5. గాహ్ (అవిభాజ్య పంజాబ్)లోని సింగ్ చిన్ననాటి ఇంట్లో విద్యుత్తు, నీళ్లు, పాఠశాలు లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకోవడానికి మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది.
6. మన్మోహన్ సింగ్ 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. ఫలితంగా ఆయన కుటుంబం అమృత్‌సర్‌కు వలస వచ్చి స్థిరపడింది.
7. 1993లో యూరోమనీ అండ్ ఏషియామనీ “ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్”గా ఎంపికయ్యారు.
8. 2004లో భారత ప్రధాని అయిన తొలి హిందూయేతర వ్యక్తి.. మన్మోహన్ సింగ్.
9. 1962లో భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. మన్మోహన్ సింగ్‌కు తన ప్రభుత్వంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కానీ అమృత్‌సర్‌లోని తన కళాశాలలో అధ్యాపక వృత్తిలో చదువు చెప్పాలని ఉందని సింగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు.
10. సింగ్ కు ప్రతిరోజూ ఉదయం బీబీసీలో వార్తలు చూసే అలవాటు ఉంది. ఈ అలవాటే 2004 సునామీ సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించింది. విపత్తుకు తక్షణమే స్పందించగలిగారు.
మన్మోహన్ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. “జీవితంలో ఒక మెంటర్ని ఒక మార్గదర్శిని కోల్పోయాను,” అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. “మన్మోహన్ సింగ్ జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం,” అని మరో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం