Manipur violence : సీఎం ఇంటిపై దాడి- మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస!
Manipur violence today : మణిపూర్‌లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. సీఎం నివాసంపై కొందరు దాడి చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి!
మణిపూర్ మళ్లీ అట్టుడుకుతోంది! ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసాన్ని ముట్టడించేందుకు అల్లరిమూకలు ప్రయత్నించడంతో శనివారం మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన నివాసంలో లేరని, ఆయన కార్యాలయంలో సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
మణిపూర్ హింసాకాండ- మంత్రుల నివాసాలపై దాడులు..
మణిపూర్ లాంఫెల్ సనకీతేల్లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపమ్ రంజన్ నివాసంపై కూడా ఒక గుంపు దాడి చేసింది. వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రి ఎల్ సుసింద్రో సింగ్ ఇంటిని లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అల్లుడు, బీజేపీ శాసనసభ్యుడు ఆర్ కె ఇమో సగోల్ బంద్ ఇంటి ముందు కూడా నిరసనకారులు గుమిగూడారు.
మణిపూర్ కీషాంథాంగ్లోని టిడిమ్ రోడ్డులోని స్వతంత్ర శాసనసభ్యుడు సపమ్ నిషికాంత సింగ్ ఇంటి ముందు గుమిగూడిన కొందరు హింసకు పాల్పడ్డారు.
నిషికాంత సింగ్ కు చెందిన స్థానిక వార్తాపత్రిక కార్యాలయంపై ఆందోళనకారులు దాడి చేయడంతో దాని తాత్కాలిక నిర్మాణాలు దెబ్బతిన్నాయి.
ఈ దాడులు నిరసనకారుల్లో పెరుగుతున్న అసంతృప్తిని నొక్కిచెప్పాయి! రాష్ట్రంలో పెరుగుతున్న హింసను నియంత్రించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.
కర్ఫ్యూ, ఇంటర్నెట్ సస్పెన్షన్..
మణిపూర్‌లో హింస పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం శనివారం సాయంత్రం 4:30 గంటల నుంచి ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది.
విద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తిని అరికట్టడానికి, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రెచ్చగొట్టే వీడియోల ప్రసారాన్ని నిరోధించడానికి ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్పీ చురాచంద్పూర్ జిల్లాల్లో ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలను నిలిపివేశారు.
ఆరు మృతదేహాల వెలికితీతతో ఆందోళనల ..
నవంబర్ 11న భద్రతా దళాలు 10 మంది హ్మార్ పురుషులను చంపారు. ఆ ప్రదేశానికి సమీపంలోని నిర్వాసిత ప్రాంతం శిబిరం నుంచి ఆరుగురు మైతే జాతి వారు అదృశ్యమై చివరికి వారి మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిణామాలు మణిపూర్‌లో తాజా హింసకు కారణమైయ్యాయి.
హతమైన వారిని భద్రతా దళాలు మిలిటెంట్లుగా అభివర్ణించాయి, అయినప్పటికీ కుకి-జో కమ్యూనిటీ వారు గ్రామ వాలంటీర్లు అని పేర్కొంది.
కుకీ మిలిటెంట్లు అపహరించిన ఆరుగురు మైతే బాధితుల్లో 25 ఏళ్ల మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు, 31 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తె, 60 ఏళ్ల మహిళ ఉన్నారు. సోమవారం జిరిబామ్ నుంచి గల్లంతైన ఆరుగురిలో ఒకరిగా భావిస్తున్న ముగ్గురి మృతదేహాలు జిరి నదిలో తేలియాడుతూ కనిపించాయి.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
హింసాత్మక ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ ఎస్ పీఏ)ని తిరిగి విధించడంతో ప్రజల నిరాశ మరింత పెరిగింది. ఘర్షణను తగ్గించడంలో, ఏఎఫ్ఎస్పీఏ తిరిగి రావడాన్ని వ్యతిరేకించడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శించారు.
సంబంధిత కథనం