Manipur CM Resign : మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా.. ఆ కారణాలతోనే..-manipur cm biren singh resigns amid violence in state know complete details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Cm Resign : మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా.. ఆ కారణాలతోనే..

Manipur CM Resign : మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా.. ఆ కారణాలతోనే..

Anand Sai HT Telugu
Updated Feb 09, 2025 08:12 PM IST

Manipur CM Resignation : మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. సీఎం రాజీనామా మణిపూర్ రాజకీయాల్లో గందరగోళం సృష్టించింది. రాష్ట్రంలో తర్వాత ఏం జరుగుతుందోనని అందరికీ ఆసక్తి నెలకొంది.

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పెద్ద రాజకీయ దుమారం రేగింది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు. ఇంఫాల్‌లోని రాజ్ భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సీఎం బీరెన్ సింగ్ తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రంలో రెండు తెగల మధ్య హింస తర్వాత మణిపూర్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెగల మధ్య వైరం

ఎందుకంటే చాలా రోజులుగా మెయితీ, కుకీ అనే తెగల మధ్య వైరంతో మణిపూర్ అట్టుడుకిపోతుంది. ఈ హింస దేశవ్యాప్తంగా విమర్శలకు గురైంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఈరోజు దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆ తర్వాత సీఎం పదవికి రాజీనామా చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సీఎంపై విమర్శలు

రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై ఆయన చాలా కాలంగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఓ వైపు మణిపూర్ హింసాకాండ, మరోవైపు బీరెన్ సింగ్ నాయకత్వ సామర్థ్యంపై బీజేపీలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చడానికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది.

చర్చించి నిర్ణయం

కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ) మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ బీజేపీకి మెజారిటీకి తగిన సంఖ్యాబలం ఉంది. అయితే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు డిమాండ్ ను లేవనెత్తారు. ఒకవేళ బలపరీక్ష జరిగితే ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తే.. సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండేందుకు పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.

మణిపూర్ ప్రజలకు సేవ చేయడం ఇప్పటివరకు గౌరవంగా భావిస్తున్నానని బీరెన్ సింగ్ తన రాజీనామాలో రాశారు. 'కేంద్ర ప్రభుత్వానికి నేను చాలా కృతజ్ఞుడను. సకాలంలో చర్యలు తీసుకున్నారు, సహాయం చేశారు. అభివృద్ధి పనులు చేశారు. మణిపురి ప్రయోజనాలను కాపాడటానికి అనేక ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ విధంగా పనిచేయడం కొనసాగించాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను.' అని బీరెన్ సింగ్ పేర్కొన్నారు.

బీరెన్ సింగ్ రాజీనామా మణిపూర్ రాజకీయాల్లో గందరగోళం సృష్టించింది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పాత్ర కూడా ఇక్కడ ముఖ్యమైనదిగా భావిస్తున్నారు. శాంతిని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

అనేక మంది మృతి

వాస్తవానికి మణిపూర్‌లో మే 2023 నుండి జాతుల మధ్య వైరం కొనసాగుతోంది. మెయితీలు, కుకీలు అనే రెండు తెగల మధ్య జరుగుతున్న గొడవ దేశం మెుత్తం చూస్తోంది. లోయలో మెయితీ సమాజం నియంత్రణలో ఉంది. కొండలపై కుకీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మెయితీలు, కుకీ తెగల మధ్య వివాదం చెలరేగి హింస జరిగింది. ఈ ఘటనలో 250 మందికి పైగా మరణించారు. 60,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2024 చివరిలో జిరిబామ్‌లో ఆరు మృతదేహాలు దొరికాయి. తరువాత మరిన్ని నిరసనలు జరిగాయి. అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.

మెయితీలు, కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయాల్లో వివాదం ఉంది. మెల్లగా మెుదలైన హింసా మణిపూర్‌ను అగ్నిగుండంలా మార్చింది. ఈ విషయాన్ని భారత్ మెుత్తం చూసింది. మెయితీలు, కుకీల తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ వివాదానికి సంబంధించి బీరెన్ సింగ్ ఆడియో టేపు కూడా కలకలం సృష్టించింది.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.