Mangaluru Auto Blast: ‘ఐసిస్ ప్రేరేపణతోనే.. ఇంట్లోనే బాంబుల తయారీ’
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలను కర్ణాటక పోలీసులు గుర్తించారు. నిందితుడు షరీక్ నివాసంతో పాటు మరిన్ని చోట్ల తనిఖీలు చేశారు.
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు ఘటన సంచలనంగా మారింది. ఈ పేలుడుకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని వెల్లడించిన కర్ణాటక పోలీసులు.. విచారణను వేగవంతం చేశారు. ఈ ఆటోరిక్షా బ్లాస్ట్ కు పాల్పడిన నిందితుడు షరీక్ ఇంట్లో సోదాలు చేశారు. మైసూరులోని అతడి నివాసంతో పాటు మరిన్ని చోట్ల సోమవారం తనిఖీలు చేశారు. కీలక ఆధారాలు సేకరించారు. వివరాలు వెల్లడించారు.
Mangaluru Auto Blast: ఐసిస్ ప్రేరేపణతో..
మంగళూరు ఆటో పేలుడుకు పాల్పడిన నిందితుడు షరీక్.. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ద్వారా ప్రేరేపణ పొందాడని పోలీసులు తేల్చారు. ఐసిస్ ప్రభావం ఉన్న ఉగ్రవాద గ్రూప్ ఆల్ హింద్‍తోనూ ఇతడికి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.
Mangaluru Auto Blast: ఇంట్లోనే బాంబుల తయారీ
నిందితుడు షరీక్.. బాంబులను ఇంట్లోనే తయారు చేసుకునే వాడని ఓ పోలీసులు అధికారి వెల్లడించారు. వాటిని నదీ పరివాహక ప్రాంతాల్లో ట్రయల్ బ్లాస్ట్ చేసే వాడని గుర్తించినట్టు చెప్పారు. మైసూరులోని షరీక్ ఉంటున్న ఇంట్లో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే రెండు కేసుల్లో నిందితుడుగా ఉన్న అరాఫత్ అలీ, ఆల్ హింద్ మాడ్యూల్ కేసులో నిందితుడిగా ఉన్న ముసావిర్ హుసేన్‍తోనూ షరీక్‍కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. మతిన్ తహా అతడికి ప్రధాన హ్యాండర్‍గా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు, ముగ్గురు షరీక్ కోసం పని చేస్తున్నారని, వారిని గుర్తించే పనిలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.
మైసూరుతో పాటు కర్ణాటకలోని ఐదు ప్రాంతాల్లో పోలీసులు ఈ తనిఖీలు చేశారు. “ఐసిస్ సిద్ధాంతాలతో షరీక్ ప్రేరేపితుడయ్యాడు. ఇంట్లోనే బాంబులు తయారు చేస్తున్నాడు. సెప్టెంబర్ 19న, మంగళూరులోని నది పక్కన మరో ఇద్దరితో కలిసి షరీక్ ఓ ట్రయల్ బ్లాస్ట్ చేశాడు” అని ఓ పోలీస్ అధికారి చెప్పారు.
షరీక్‍తో సంబంధాలున్న ఓ వ్యక్తిని కోయంబత్తూరులోని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇటీవల జరిగిన కోయంబత్తూరు బ్లాస్ట్ కేసుతో ఈ మంగళూరు పేలుడుకు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
Mangaluru Blast: బ్లాస్ట్ ఇలా..
కోయంబత్తూరులో ఓ ఆటోలో శనివారం పేలుడు జరిగింది. పేలుడు పదార్థాలను (IED)ను ప్రెజర్ కుక్కర్ లో పెట్టిన షరీక్ తీసుకెళుతుండగా.. ఈ బ్లాస్ట్ జరిగింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం నగరంలోని ఓ ఆసుపత్రితో షరీక్ చికిత్స పొందుతున్నాడు. ఈ బ్లాస్ట్ తో ఉగ్రవాద లింకులు ఉన్నాయని పోలీసులు తేల్చారు. దీంతో విచారణ వేగవంతం చేశారు. కోలుకున్న తర్వాత షరీక్ ను విచారిస్తామని చెప్పారు.