Crime news : పిల్లల ముందే తల్లిపై అత్యాచారం! యాసిడ్ పోసి..!
Assam Crime news : తన పిల్లల ముందే తన మహిళను పొరుగింటి వ్యక్తి రేప్ చేశాడని, అనంతరం యాసిడ్ తరహా రసాయనాన్ని పోశాడని బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన అసోంలో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసోంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన పొరుగింట్లో నివాసముండే మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుస్తోంది! తన పిల్లల ముందే ఆ మహిళను రేప్ చేశాడని, అనంతరం యాసిడ్ తరహా రసాయనాన్ని పోసి పారిపోయాడని బాధితురాలి భర్త కేసు వేశాడు.

ఇదీ జరిగింది..
అసోం సిల్చార్లో ఈ ఘటన జరిగింది. బాధితురాలి భర్త ప్రకారం.. నిందితుడు ఒక డ్రైవర్. జనవరి 21న నిందితుడు, తన పొరుగింటిలో ఉండే ఓ మహిళను రోడ్డు మీద అడ్డుకున్నాడు. ఫోన్ నెంబర్ ఇవ్వమని బెదిరించాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోకుండా, అక్కడి నుంచి వెళ్లిపోయింది. జనవరి 22న నిందితుడు ఆ మహిళ ఇంట్లోకి దూసుకెళ్లాడు. బలవంతం చేసి ఆమెను రేప్ చేశాడు. ఆమె ఇద్దరు పిల్లల ముందే, మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం యాసిడ్ తరహా రసాయనాన్ని పోసి పరారయ్యాడు.
ఆ సమయంలో ఆ ఇంట్లో మహిళ భర్త లేడు. కొన్ని గంటల తర్వాత మహిళ భర్త ఇంటికి వెళ్లాడు. నేల మీద పడి ఉన్న తన భార్యను చూసి షాక్ అయ్యాడు. ఆమె శరీరం, నోటిలో యాసిడ్ తరహా రసాయనాన్ని చూశాడు. ఆమె కాళ్లు కూడా కట్టేసి ఉన్నట్టు గుర్తించాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాడు. సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఆ మహిళకు చికిత్స చేశారు. ఆమె శరీరంపై 70శాతం కాలిన గాయాలు ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"అతను (నిందితుడు) ఆ ప్రాంతంలోని అనేక మంది మహిళలను హింసించాడు. పెళ్లైన మహిళలే అతని టార్గెట్. ఫోన్ నెంబర్ ఇవ్వమని బెదిరించేవాడు. అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. అనేకమార్లు స్థానికులు ఈ సమస్యను పరిష్కరించారు. కానీ అతని ప్రవర్తన మారలేదు," అని బాధితురాలి భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఫోన్ని ట్రాక్ చేశారు. చివరికి, ఘటన జరిగిన 15 కిలోమీటర్ల దూరంలోని ఓ చోట నిందితుడిని గురువారం పట్టుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు.
నిందితుడి భార్య వాదన ఇలా..
అయితే, తన భర్త ఎలాంటి తప్పు చేయాలేదని నిందితుడి భార్య చెబుతోంది. తన భర్తను కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి.. తన భర్త నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నాడని చెప్పింది.
"సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఘటన జరిగిన సమయంలో నా భర్త అక్కడ లేడని అవి నిరూపిస్తాయి," అని నిందితుడి భార్య పేర్కొంది.
ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు.
"మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నాము. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాము," అని పోలీసులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం