Horror in the fight: విమానంలో భయానక అనుభవం; ప్రయాణంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు వ్యక్తి ప్రయత్నం
Horror in the fight: విమానం టేకాఫ్ అయిన అరగంట తరువాత ఒక ప్రయాణికుడు విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించి సిబ్బందిని, సహ ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. దాంతో, విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Horror in the fight: అల్బుకెర్కీ నుండి షికాగో వెళ్తున్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఆరుగురు ధైర్యవంతులైన ప్రయాణికులు డక్ట్ టేప్, ఫ్లెక్సీ కఫ్ లను ఉపయోగించి అడ్డుకున్నారు. మంగళవారం న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుంచి చికాగో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం
ఆ వ్యక్తిని అడ్డుకున్న ప్రయాణీకుల్లో ఒకరు ఎక్స్, (గతంలో ట్విట్టర్) లో తన భయానక అనుభవాన్ని పోస్ట్ చేశారు. ‘‘అల్బుకెర్కీ నుండి బయలుదేరిన 30 నిమిషాల తరువాత నాకు 4 వరుసల వెనుక ఉన్న ఎమర్జెన్సీ డోర్ ను దూకుడుగా తెరవడానికి ప్రయత్నించసాగాడు. విమానంలో అందరూ భయంతో వణికిపోతున్నారు. నేను, మరో ఐదుగురు సహ ప్రయాణికులు కలిసి ధైర్యం చేసి అతడిని అడ్డుకున్నాం. అతని కాళ్లను టేప్ చేసి, ఫ్లెక్సీ కఫ్ లతో అతడిని బంధించాం. ముప్పును శంకించిన సిబ్బంది తిరిగి విమానాన్ని సురక్షితంగా ఏబీక్యూలో ల్యాండ్ చేశారు’’ అని ఆ ప్రయాణికుడు వివరించాడు.
భయపడిపోయాం..
అదే విమానంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి కూడా భయంకరమైన ఈ అనుభవం గురించి ఎక్స్ లో పోస్ట్ చేశాడు. ‘‘ఎబిక్యూ నుండి షికాగోకు తిరిగి వస్తున్నాము. విమానం టేకాఫ్ అయి సుమారు 30 నిమిషాలు అయింది. ఇంతలో ఎక్కడి నుంచో ఒక్కసారిగా గట్టిగా గాలి వీయసాగింది. విమానం వెనుకవైపు ఒక వ్యక్తి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ను కొంత తెరిచాడు. దాంతో, ఒక్కసారిగా గాలి లోపలికి వచ్చింది. ప్రయాణికుల్లో కొందరు అతన్ని ఎదిరించి బంధించారు. వెంటనే, అత్యవసరంగా విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లారు’’ అని ఆ ప్రయాణికుడు ట్విటర్ లో పోస్ట్ చేశాడు. ఎమర్జెన్సీ డోర్ తీయడానికి ప్రయత్నించిన వ్యక్తి వివరాలను ఏర్ లైన్స్ వెల్లడించలేదు. అయితే, ఆ వ్యక్తిని ఆరుగురు హీరోలు విమానం నుంచి దింపుతున్న వీడియోను ఒక ప్రయాణికురాలు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఆ వ్యక్తి అత్యవసర తలుపును కొద్దిగా తెరవగలిగాడని, దీంతో క్యాబిన్లోకి పెద్ద ఎత్తున గాలులు వీచాయని ఆమె ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, విమానం తిరిగి ల్యాండ్ అయిన తరువాత అల్బుకెర్కీలోని స్థానిక లా ఎన్ ఫోర్స్ మెంట్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుందని అమెరికన్ ఎయిర్ లైన్స్ తెలిపింది.