ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! 45ఏళ్ల వ్యక్తి ఆస్తిపై కన్నేసిన ఓ మహిళ.. మారువేషంలో ఆయన్ని వివాహం చేసుకుంది. పెళ్లి జరిగిన రెండు గంటల్లోనే, తన సహచరులతో కలిసి చంపేసింది.
పలు మీడియా కథనాల ప్రకారం మధ్యప్రదేశ్ జబల్పూర్కి చెందిన ఇంద్రకుమార్ తివారీకి 18 ఎకరాల భూమి ఉంది. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పెళ్లి అవ్వడం లేదు. తీవ్ర మనస్తాపానికి గురైన తివారీ గత నెలలో మతగురువు గురు అనురుద్ధచార్య మహరాజ్ దగ్గరికి వెళ్లాడు. అందరి ముందు తన బాధను గురువుతో చెప్పుకున్నాడు. తనకు ఆస్తి చాలానే ఉన్నప్పటికీ, పెళ్లి జరగడం లేదన్న అసహనంతో ఉన్నట్టు, తనతో కలిసి తన భూమిని చూసుకోవడానికి ఎవరూ లేరని చెప్పాడు.
ఆ మాటలు విన్న గురువు.. "సాధువు అయిపోయి, ఆ భూమిని ప్రజా సేవకు అంకితమివ్వమని" అని హాస్యం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది జరిగిన కొన్ని రోజులకు కుషి తివారీ అనే మహిళ సోషల్ మీడియా వేదికగా ఇంద్రకుమార్ తివారీని సంప్రదించింది. ఆయనతో కొన్ని రోజులు మాట్లాడింది. చివరికి, పెళ్లి చేసుకుందామని చెప్పింది. వివాహం కోసం ఎదురుచూస్తున్న ఇంద్రకుమార్ తివారీ, ముందువెనుక చూసుకోకుండా కుషి తివారీ ప్రపోజల్‌ని అంగీకరించాడు.
కుషి అనే మహిళను పెళ్లి చేసుకుంటున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పి ఈ నెల 6న యూపీలోని కుషినగర్‌కి వెళ్లాడు తివారీ. అక్కడి నుంచి కుషితో కలిసి గోరఖ్‌పూర్‌కి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు.
ఇంద్రకుమార్ పెళ్లైతే చేసుకున్నాడు కానీ ఆ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు! పెళ్లి జరిగిన రెండు గంటల వ్యవధిలోనే కుషి తివారీ.. తన సహచరులతో కలిసి ఇంద్రకుమార్‌ని చంపేసింది. అనంతరం మురికి కాలువలో పడేసింది. ఆయన దగ్గరున్న నగదు, బంగారు ఆభరణాలను తీసుకుని వారందరు అక్కడి నుంచి పారిపోయారు.
మెడ మీద కత్తితో కనిపించిన ఒక మృతదేహాన్ని చూసి షాకైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మృతుడు మధ్యప్రదేశ్ వాసి అని యూపీ పోలీసులు తెలుసుకున్నారు. అనంతరం మధ్యప్రదేశ్ పోలీసులతో కలిసి దర్యాప్తును కొనసాగించారు.
ఈ క్రమంలోనే కుషి తివారీ గురించి అసలు విషయాలు వెలువడ్డాయి. కుషి తివారీ అసలు పేరు సాహిబా బానో! ఫేక్ ఆధార్ కార్డు సృష్టించి, ఇంద్రకుమార్‌ని ఆమె మోసం చేసింది.
చివరికి పోలీసులు సాహిబాను అరెస్ట్ చేశారు.
"సాహిబాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశాము. పెళ్లి ఫొటోలు ఉపయోగించి, ఒక విధవగా మృతుడి భూమిని పొందాలని సాహిబా ప్లాన్ చేసింది. అందుకే ఇంద్రకుమార్‌ని చంపేశారు," అని పోలీసులు వెల్లడించారు.
సాహిబా, ఆమె సహచరులు ఇలా మోసాలు చేయడం ఇది మొదటిసారి కాదని తెలుస్తోంది! ఆమె సహచరుల్లో ఒకడైన కుషాల్ అనే వ్యక్తి.. ఈ ఏడాది తొలినాళ్లల్లో ఇదే విధంగా ఒక ఫేక్ పెళ్లి చేసుకున్నాడు.
సంబంధిత కథనం