20 Lakhs In Cow Dung : హైదరాబాద్‌లో 20 లక్షల చోరీ చేసి ఒడిశాలో పెంటకుప్పలో దాచిన వ్యక్తి
20 Lakhs In Cow Dung : దొంగతనం చేసినవారు చేసే పనులు కొన్ని వింతగా ఉంటాయి. దోచుకున్న సొమ్ము ఎక్కడ దాచిపెట్టాలో తెలియక వింత పనులు చేస్తుంటారు. ఓ వ్యక్తి ఏకంగా 20 లక్షల రూపాయలు ఆవు పేడ కింద దాచిపెట్టాడు.
పెంట కుప్పలో భారీగా డబ్బు దొరికిన ఘటన ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన కమర్దా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో జరిగింది. హైదరాబాద్, ఒడిశాకు చెందిన పోలీసు అధికారుల బృందం బాదమందరుని గ్రామానికి చేరుకుని గోపాల్ బెహెరా అనే వ్యక్తి అత్తగారి ఇంటిపై దాడి చేసింది. వారికి విచిత్రమైన ఘటన ఎదురైంది. నిందితుడు గోపాల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
హైదరాబాద్‌లోని ఆగ్రో కంపెనీ యజమాని నుండి 20 లక్షలకు పైగా దోచుకున్న కేసులో గోపాల్ ఉన్నాడు. నిందితుడు దొంగిలించిన డబ్బును తన బావకు ఇచ్చాడు. ఆ డబ్బును అతని బావ రవీంద్ర బెహెరా ద్వారా ఒడిశాలోని స్వగ్రామానికి తరలించాలని ప్లాన్ చేశాడు. ఈ మేరకు ప్లాన్ అమలు చేశాడు.
నివేదికల ప్రకారం, గోపాల్ బెహెరా అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఆగ్రో కంపెనీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల బ్యాంకు సెలవు కారణంగా.. అతని యజమాని ఆఫీస్ లాకర్‌లో రూ.20,80,670 ఉంచాడు. గోపాల్ డబ్బును దొంగిలించాడు. అత్తమామల ఇంటికి పంపించి.. హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు.
చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ పోలీసులు కమర్దా పోలీసుల సహకారంతో బాదమందూరుని గ్రామంలో గోపాల్ అత్తగారి ఇంట్లో వెతకడం మెుదలుపెట్టారు. పెరట్లోని పెంట కుప్పలో పాతిపెట్టిన చోరీ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇలా చివరకు పెంట కుప్పలో దాచిన డబ్బును గుర్తించారు. గోపాల్ పరారీలో ఉన్నాడని కమర్దా పోలీస్ స్టేషన్ అధికారి ప్రేమదా నాయక్ తెలిపారు.
పోలీసులు అతని బావ రవీంద్ర బెహెరా, అతని అత్తను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. గోపాల్‌ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.