Maha kumbh : 15ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు- 'మహా కుంభమేళా' పేరు వినగానే గతం గుర్తొచ్చింది!
Maha kumbh Mela 2025: 15 ఏళ్లుగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకున్న కొన్ని రోజులకే అతను దర్శనమిచ్చాడు! మహా కుంభమేళా నేపథ్యంలో జరిగిన ఈ ఘటన వార్తల్ల నిలిచింది.

ఝార్ఖండ్‌లో జరిగిన ఒక ఘటన ఇప్పుడు వార్తల్లో నిలిచింది! 15ఏళ్ల క్రితం కుటుంబసభ్యుల నుంచి దూరమైన ఒక వ్యక్తి.. తన జీవితం గురించి చాలా విషయాలు మర్చిపోయాడు. కాగా, ఇప్పుడు 'మహా కుంభమేళా' పేరు వినగానే ఆ వ్యక్తికి తన గతం గుర్తొచ్చింది. చివరికి, 15ఏళ్ల తర్వాత అతను తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు.
ఇదీ జరిగింది..
ఝార్ఖండ్కి చెందిన ప్రకాశ్ మహతో అనే వ్యక్తి 2010 సమయంలో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసేవాడు. కానీ అతనికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉండేవి. 2010 మేలో ఓరోజు ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయలుదేరిన మహతో అదృశ్యమైపోయాడు! కుటుంబసభ్యులు ఎంత వెతికినా మహతో కనిపించలేదు. ఝార్ఖండ్‌లోని మార్కచో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. పోలీసులు ఎంత గాలించినా మహతో వివరాలు తెలియరాలేదు. కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కాగా.. మార్కచో పోలీస్ స్టేషన్‌కి పశ్చిమ్ బెంగాల్ రాణీగంజ్‌లో నివాసముండే సుమిత్ సావో నుంచి ఇటీవలే ఒక ఫోన్ కాల్ వచ్చింది. తనకు ప్రకాశ్ మహతో తెలుసుని పోలీసులకు చెప్పాడు.
మహతో ఇంతకాలం ఏమయ్యాడు?
2010 మేలో ఉద్యోగం కోసం వెళ్లిన మహతో.. పశ్చిమ్ బెంగాల్ రాణీగంజ్కి చేరాడు. సుమిత్ సావో తండ్రి అతడికి ఉద్యోగం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ హోటల్లో మహతో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. మహతో తన గురించి, తన కుటుంబసభ్యుల గురించి ఎప్పుడూ చెప్పలేదు. తనకు ఏం గుర్తులేదు అన్నట్టు మాట్లాడేవాడు.
మహతోని కుటుంబసభ్యుల్లో ఒకరిగా చూశారు సాహో తండ్రి. అతడిని అన్ని విధాలుగా బాగా చూసుకునేవారు.
కాగా.. 2025 మహా కుంభమేళా నేపథ్యంలో కథ మలుపు తిరిగింది. యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని సుమిత్ సాహో తన కుటుంబసభ్యులతో మాట్లాడాడు. ఆ మాటలను మహతో విన్నాడు. తనకు తన గతం కొద్దిగా గుర్తొచ్చింది. తన ఇల్లు కుంభమేళాకు వెళ్లే మార్గంలోనే ఉంటుందని చెప్పాడు. ఆ వెంటనే.. తన కుటుంబసభ్యుల గురించి ఒక్కో విషయం గుర్తుతెచ్చుకుని చెప్పడం మొదలుపెట్టాడు. మహతో చెప్పిన వివరాలను జాగ్రత్తగా సేవ్ చేసుకున్న సుమిత్.. స్థానిక పోలీస్ స్టేషన్‌కి సమాచారం ఇచ్చాడు. పోలీసులు, మార్కచో పోలీస్ స్టేషన్‌ని సంప్రదించారు.
15ఏళ్లకు ఇంటికెళ్లిన మహతో..
ఫిబ్రవరి 7న 52ఏళ్ల మహతో మార్కచో పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాడు. అక్కడ తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. అతడిని చూసిన వెంటనే మహతో భార్య గీత దేవి, పిల్లలు సుజాల్, రాణిలు కన్నీరు పెట్టుకున్నారు. ఇంతకాలం తన తండ్రి ఫొటోలను చూస్తూ పెరిగిన ఆ పిల్లలు, తొలిసారి మహతోని చూసి ఆలింగనం చేసుకున్నారు.
మహతో లేకపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడింది. కూలీపని చేసుకుంటూ పిల్లలను సొంతంగా పెంచింది గీత.
ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయం జరిగింది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మహతోకి రావాల్సిన డబ్బులు ఇంతకాలం అలాగే ఉండిపోయాయి. మహతో తన కుటుంబసభ్యులను కలుసుకునేందుకు 10 రోజుల ముందు.. కేఎంసీ ఒక లెటర్ పంపించింది. ప్రభుత్వ రూల్స్ ప్రకారం డబ్బులు పొందాలంటే డెత్ సర్టిఫికేట్ కావాలి. మహతో డెత్ సర్టిఫికేట్ కోసం కుటుంబం దరఖాస్తు చేసింది. 10 రోజులకే మహతో దర్శనమిచ్చాడు.
సంబంధిత కథనం