26 ఏళ్ల యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఐస్క్రీమ్ ఫ్రీజర్లో భద్రపరిచిన ఘటన త్రిపురలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత యువకుడు ఒక 20 ఏళ్ల యువతికి బాయ్ ఫ్రెండ్. ఇటీవల ఆ యువతి తండ్రి చనిపోయాడు. ఆ బాధలో ఉన్న యువతికి వారి సమీప బంధువు దగ్గరయ్యాడు. ఆమెతో సంబంధం పెట్టుకోవాలని భావించాడు.అందుకు ఆమె బాయ్ ఫ్రెండ్ అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని హత్య చేశాడు.
పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బంగ్లాదేశ్ కు చెందిన ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. తన సమీప బంధువు అయిన ఆ యువతి బాయ్ ఫ్రెండ్ ను హతమార్చడానికి పక్కా ప్రణాళిక రచించాడు. జూన్ 8న పశ్చిమ త్రిపురలోని దక్షిణ ఇందిరానగర్ లోని తమ బంధువు ఇంటికి బాధిత యువకుడిని ఆహ్వానించాడు. ఈ హత్యలో తనకు సహకరించడానికి మరో ముగ్గురిని తీసుకువచ్చాడు. వారి సాయంతో ఆ యువకుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని పెద్ద ట్రాలీ బ్యాగ్ లో కుక్కి పక్కన పెట్టారు.
మరుసటి రోజు గండచెర్రాలో నివసిస్తున్న తన తల్లిదండ్రులను అగర్తలాకు రమ్మని పిలిచాడు. వారు తమ కార్ లో రాగానే, ఆ ట్రాలీ బ్యాగ్ ను వారితో పంపించాడు. అతని తల్లిదండ్రులు తిరిగి గండచెర్ల వెళ్లి ఆ మృతదేహాన్ని తమ దుకాణంలోని ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో దాచిపెట్టారు.
బాధిత యువకుడి తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో ఆ వైద్యుడిని అరెస్ట్ చేసి, తమదైన స్టైల్ లో విచారించడంతో అసలు నిజం బయటపడింది. అతని వాంగ్మూలం ఆధారంగా బాధితురాలి మృతదేహాన్ని బుధవారం ఫ్రీజర్ నుంచి వెలికితీసి, పోస్ట్ మార్టం కు పంపించారు. నిందితుడిని, అతడి తల్లిదండ్రులను, అతడికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు.
ఇటీవలే తండ్రిని కోల్పోయిన, తమ బంధువైన మహిళతో ఆ కజిన్ శారీరకంగా సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. ఆమె బాయ్ ఫ్రెండ్ సీన్ లో ఉన్నంత వరకు తాను అలా చేయలేనని తెలుసుకుని, అతన్ని చంపేందుకు కుట్ర పన్నాడు. నిందితుడు ఈస్ట్ అగర్తలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకుమారిలోని మహిళ ఇంటికి తరచూ వస్తుండేవాడని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
సంబంధిత కథనం