ఫ్రాన్స్ లోని అవిగ్నాన్ లో ఓ ఫ్రెంచ్ పెన్షనర్ డొమినిక్ పి గత 12 సంవత్సరాలుగా తన భార్యకు మత్తుమందు ఇచ్చి ఆమెపై ఇతరులతో అత్యాచారం చేయిస్తున్న దారుణ ఘటన సెప్టెంబర్ 2న వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ భర్తతో పాటు అత్యచారానికి పాల్పడిన 50 మంది కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. నిందితుడు ఫ్రాన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ వినియోగ సంస్థ ఈడీఎఫ్ లో మాజీ ఉద్యోగి.
గత 12 సంవత్సరాలుగా ఆ మహిళపై 72 మంది మొత్తం 92 అత్యాచారాలకు పాల్పడ్డారని, వీరిలో 51 మందిని గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిపై కూడా విచారణ జరిగుతుందని చెప్పారు. 26 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న నిందితులంతా దాదాపు దశాబ్దకాలంగా 72 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమె మత్తులో ఉందని, ఈ వేధింపుల గురించి ఆమెకు తెలియదని నివేదిక పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి ప్రిసైడింగ్ జడ్జి రోజర్ అరాటా అన్ని విచారణలు బహిరంగంగా జరుగుతాయని ప్రకటించారు. బాధితురాలి అభ్యర్థన మేరకు విచారణను బహిరంగంగానే కొనసాగిస్తామన్నారు. ‘‘రహస్య విచారణ కోరుకుంటారా? అని ఆ మహిళను ప్రశ్నించగా.. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కలగాలని, అందువల్ల బహిరంగ విచారణనే కోరుకుంటున్నానని ఆమె చెప్పారు’’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తనకు ఏం జరిగిందో వీలైనంత విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆమె కోరుకుంటున్నారని బాధితురాలి తరఫు న్యాయవాది స్టీఫెన్ బాబోనే పేర్కొన్నారు.
మరో న్యాయవాది ఆంటోనీ కాము మాట్లాడుతూ ఈ విచారణ ఆమెకు భయంకరమైన పరీక్ష అని అన్నారు. గత 12 ఏళ్లుగా తాను అనుభవించిన అత్యాచారాలను తొలిసారిగా ఆమె అనుభవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాధితురాలు తన ముగ్గురు పిల్లల మద్దతుతో కోర్టుకు వచ్చింది. నిందితుల అసలు రంగు బయటపడాలనే ఆమె బహిరంగ విచారణను కోరుకున్నారు. మరోవైపు, తొమ్మిదేళ్ల వయసులో తనపై మేల్ నర్సు అత్యాచారానికి పాల్పడ్డాడని నిందితుడు డొమినిక్ పి వెల్లడించాడు. తన కుటుంబాన్ని, తన భార్యను కోర్టులో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడని ఆయన తరఫు న్యాయవాది బియాట్రిస్ జావర్రో తెలిపారు. 1991లో హత్య, అత్యాచారం, 1999లో అత్యాచార యత్నం వంటి అభియోగాలు కూడా ఆయనపై నమోదయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.