బెంగాల్లో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య జరుగుతున్న యుద్దం మరో అంకానికి చేరింది. గవర్నర్ వైఖరితో తీవ్రంగా విభేదిస్తున్న మమతా బెనర్జీ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల కులపతిగా గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు కల్పించాలని నిర్ణయించారు. గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించే ముసాయిదా చట్టానికి రాష్ట్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కడ్‌ల మధ్య ఇటీవలి కాలంలో అభిప్రాయభేదాలు తీవ్రం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహంతో గవర్నర్ రాష్ట్రంలో వివాదాలు సృష్టిస్తున్నారని మమతా బెనర్జీ అనుమానిస్తున్నారు. గవర్నర్ అధికారాలకు కత్తెర వేయడం ద్వారా కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా యూనివర్శిటీ ఛాన్సలర్ హోదా నుంచి తొలగించాలని నిర్ణయించారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ అమోదం తెలిపిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్యబసు చెప్పారు.,త్వరలో బెంగాల్ అసెంబ్లీ ముందుకు ప్రతిపాదిత బిల్లు రానుంది. బిల్లు అమోదం పొందితే బెంగాల్లోని 17 యూనివర్శిటీలపై గవర్నర్ అధికారాలను కోల్పోతారు. ప్రస్తుతం దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో యూనివర్శిటీలకు గవర్నర్ అధిపతిగా వ్యవహరిస్తున్నారు. పాలనాపరమైన వ్యవహారాలకు సైతం గవర్నర్ అమోద ముద్ర లభించాల్సి రావడంపై ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో కూడా ఇటీవల ఇదే తరహా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రాల వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోడానికి గవర్నర్లను వాడుకుంటున్నాయని పలు రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణల నుంచి ఇటీవలి కాలంలో ఇదే తరహా నిరసనలు వినిపించాయి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా పాలనాపరమైన అంశాల్లో జోక్యం చేసుకుంటోందని రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.