Maharashtra politics : గురువారమే బలపరీక్ష.. ఉద్ధవ్​ ప్రభుత్వానికి చివరి రోజు!-maharashtra politics uddhav thackeray faces floor test at 11 am tomorrow ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Maharashtra Politics, Uddhav Thackeray Faces Floor Test At 11 Am Tomorrow

Maharashtra politics : గురువారమే బలపరీక్ష.. ఉద్ధవ్​ ప్రభుత్వానికి చివరి రోజు!

Sharath Chitturi HT Telugu
Jun 29, 2022 10:40 AM IST

Maharashtra politics : గురువారం ఉదయం 11 గంటలకు.. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర గవర్నర్​ ఆదేశించారు.

ఉద్ధవ్​ ఠాక్రే
ఉద్ధవ్​ ఠాక్రే (HT_PRINT/file)

Maharashtra politics : మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు తిరిగాయి. సీఎం ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి బలపరీక్ష గండం ఏర్పడింది. గురువారం ఉదయం 11గంటలకు.. అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ రాష్ట్ర గవర్నర్ భగత్​ సింగ్​ కోషియారీ​.. ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ మేరకు ప్రత్యేక శాసనసభ సెషన్​ను నిర్వహించాలని అసెంబ్లీ సెక్రటరీ రాజేంద్ర భగవత్​కు ఓ లేఖ రాశారు.

ట్రెండింగ్ వార్తలు

మహారాష్ట్రలోని మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయిందని, బల పరీక్ష ఏర్పాటు చేసే విధంగా ఆదేశాలివ్వాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్​ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే.. చర్యలు చేపట్టారు గవర్నర్​.

గవర్నర్​ లేఖ..

మహారాష్ట్రలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తన లేఖలో పేర్కొన్నారు భగత్​ సింగ్​.

"మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఆందోనకరంగా ఉన్నాయి. 39మంది శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశిస్తున్నాను," అని లేఖలో గవర్నర్​ అన్నారు.

గౌహతీ టు గోవా..?

Eknath Shinde : గురువారం జరగనున్న బలపరీక్షకు హాజరయ్యేందుకు.. ఏక్​నాథ్​ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్స్​ సన్నద్ధమవుతున్నారు. గురువారం ఉదయం ముంబైకు చేరుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం గౌహతీలోని ఓ హోటల్​లో ఉన్న వారందరు.. కొన్ని గంటల్లో గోవాకు వెళతారని సమాచారం.

గోవా కూడా.. బీజేపీ పాలిత రాష్ట్రమే కావడం గమనార్హం.

సుప్రీంకు ఉద్ధవ్​ బృందం..

బలపరీక్షకు గవర్నర్​ ఆదేశించిన కొద్ది సేపటికే.. ఉద్ధవ్​ ఠాక్రే బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 16మంది ఎమ్మెల్యేలు.. తమపై ఉన్న అనర్హత వేటు గురించి ఇంకా స్పందించలేదని, అందువల్ల గవర్నర్​ ఆదేశాలు చెల్లవని సుప్రీంకోర్టును విన్నవించింది.

"ఎమ్మెల్యేల అనర్హత వేటుపై జులై 11న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. మరి బలపరీక్షకు గవర్నర్​ ఎలా ఆదేశాలివ్వగలరు? అనర్హత వేటు ఉన్న ఎమ్మెల్యేలు బలపరీక్షలో ఎలా పాల్గొంటారు? ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది. అందుకే మేము సుప్రీంకోర్టును ఆశ్రయించాము," అని శివసేన ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ట్వీట్​ చేశారు.

రెబల్స్​.. రెబల్స్​..

Uddhav Thackery : 2019 ఎన్నికల అనంతరం.. బీజేపీతో విడిపోయి, ఎన్​సీపీ- కాంగ్రెస్​తో కలిసి మహ వికాస్​ ఆఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది శివసేన. ఉద్ధవ్​ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు.

కాగా.. అప్పటి నుంచి ఉద్ధవ్​ ఠాక్రే ఎన్​సీపీ చేతిలో కీలుబొమ్మగా మారారని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపై తిరుగుబాటు ప్రకటించారు శివసేన సీనియర్​ నేత ఏక్​నాథ్​ షిండే. 15మంది ఎమ్మెల్యేలతో గుజరాత్​లోని సూరత్​కు వెళ్లారు. అక్కడి నుంచి గౌహతీకి వెళ్లారు. రోజులు గడిచే కొద్ది.. ఏక్​నాథ్​కు మద్దతు పెరిగింది. ప్రస్తుతం ఆయన వద్ద 40కుపైగా శివసేన ఎమ్మెల్యేలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

శివసేన అభ్యర్థనను తోసిపుచ్చి.. గురువారం బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతినిస్తే.. మహా వికాస్​ ఆఘాడీ ప్రభుత్వానికి అదే చివరి రోజు అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం