Maharashtra politics : నెల ముందే షిండేకు 'సీఎం' ఆఫర్ ఇచ్చిన ఉద్ధవ్..?
Maharashtra politics : నెల రోజుల ముందే.. షిండేకు సీఎం పదవిని ఠాక్రే ఆఫర్ చేశారని ఆదిత్య ఠాక్రే అన్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయాల వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లింది.
Maharashtra politics : మహారాష్ట్రలో శివసేన- రెబల్స్ మధ్య ప్రతిష్ఠంభన కొనసాగుతున్న తరుణంలో.. సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనపై తిరుగుబాటు వ్యూహాలు రచించిన కీలక నేత ఏక్నాథ్ షిండేకు.. ఉద్ధవ్ ఠాక్రే నెల రోజుల క్రితమే సీఎం పదవిని ఆఫర్ చేశారని అన్నారు. ఆ సమయంలో ఏక్నాథ్ షిండే కన్నీరు పెట్టుకున్నారని తెలిపారు. కానీ నెల రోజుల తర్వాత అంతా మారిపోయిందని అభిప్రాయపడ్డారు.
ట్రెండింగ్ వార్తలు
ముంబైలో.. శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆదివారం ప్రసంగించారు ఆదిత్య ఠాక్రే.
"మే 20న.. ఏక్‌నాథ్‌కు ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేశారు. సీఎం కావాలని అనుకుంటే.. ఆ పదవి ఇస్తానని షిండేకు ఉద్ధవ్ చెప్పారు. ఆ సమయంలో.. ఆయన (షిండే) పెద్ద డ్రామానే చేశారు. ఏడవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నెల రోజుల తర్వాత.. ఆయన రెబెల్‌గా మారారు. కానీ వాళ్లు(షిండే వర్గం) ఏం చేయలేరు. ఇది తిరుగుబాటు కాదు.. వేర్పాటువాదం. సీఎం అనారోగ్యంగా ఉన్న సమయంలో సరైన అవకాశం లభించిందని పావులు కదిపారు," అని ఆదిత్య ఠాక్రే చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేలందరూ రెబల్స్‌గా మారిపోయినా.. ఎప్పటికైనా గెలిచేది పార్టీనే అని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. రెబల్స్‌కు రాష్ట్రంలోకి, పార్టీలోకి ప్రవేశించేందుకు తలుపులు మూసుకుపోయాయని తేల్చిచెప్పారు.
Aditya Thackeray : అస్సాంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు.. తాము కిడ్నాప్‌కు గురైనట్టు భావిస్తున్నారని ఆదిత్య పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
"ఆ పార్టీపై సిగ్గుగా ఉంది. కేంద్రం, అస్సాంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ.. మరో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని సేవలు చేస్తోంది. అది కూడా.. ఆ రాష్ట్రంలో వరదల వల్ల ప్రజలు అల్లాడిపోతున్న సమయంలో!," అని ఆదిత్య ఠాక్రే మండిపడ్డారు.
సుప్రీంకోర్టుకు 'మహా' రాజకీయాలు..
మరోవైపు మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. తనతో పాటు 15మంది ఎమ్మెల్యేలపై మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటును వ్యతిరేకిస్తూ.. సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు ఏక్నాథ్ షిండే. దీనిపై సోమవారం విచారణ జరగనుంది.
Supreme court Maharashtra government : శివసేన శాసనసభా పక్ష నేతగా అజయ్ చౌదరీని నియమించడంపైనా సుప్రీంకోర్టులో సవాలు చేశారు షిండే. అదే సమయంలో డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌పై వేసిన అవిశ్వాస తీర్మానాన్ని కొట్టివేయడాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానం సంగతి తేలేంత వరకు.. అనర్హత వేటుపై డిప్యూటీ స్పీకర్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఆదేశాలివ్వాలని కోర్టును అభ్యర్థించారు షిండే.
ఇదీ జరిగింది..
Eknath Shinde latest news : మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలో.. శివసేనది కీలక పాత్ర. కాగా.. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో శివసేన చేతులు కలపడం.. ఆ పార్టీలో కొందరికి ఇష్టం లేదు. ఈ క్రమంలోనే శివసేనపై ఆ పార్టీ కీలక నేత ఏక్నాథ్ షిండేకు అసంతృప్తి పెరిగిపోయింది. కొన్ని రోజుల క్రితం ఆయన అనూహ్యంగా మాయమైపోయారు. పలువురు ఎమ్మెల్యేలతో పాటు గుజరాత్ సూరత్‌లో దర్శనమిచ్చారు. అక్కడి నుంచి అందరు కలిసి గౌహతీకి వెళ్లారు.
రెబల్స్ బృందానికి 'శివసేన బాలాసాహెబ్' అన్న పేరు పెట్టారు ఏక్నాథ్ షిండే. ఈ పోరాటంలో ఎవరు విజయం సాధిస్తారు? శివసేన పరిస్థితేంటి? మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం భవిష్యత్తు ఏంటి? అన్న ప్రశ్నలు.. సామాన్యుల్లో తీవ్ర ఉత్కంఠకు దారితీస్తున్నాయి.
సంబంధిత కథనం
Maharashtra politics | `బాలాసాహెబ్ పేరు వాడొద్దు`
June 25 2022
Maharashtra politics | `నీ కొడుకైతే ఎంపీ కావచ్చు..!`
June 24 2022
Eknath Shinde message | `శివసైనికుల కోసమే..!`
June 25 2022