Telugu News  /  National International  /  Maharashtra Govt To Reduce Vat On Fuel: Eknath Shinde
గుడ్​ న్యూస్​.. పెట్రోల్​- డీజిల్​పై సుంకాన్ని తగ్గించనున్న ప్రభుత్వం!
గుడ్​ న్యూస్​.. పెట్రోల్​- డీజిల్​పై సుంకాన్ని తగ్గించనున్న ప్రభుత్వం! (PTI)

గుడ్​ న్యూస్​.. పెట్రోల్​- డీజిల్​పై సుంకాన్ని తగ్గించనున్న ప్రభుత్వం!

04 July 2022, 17:41 ISTSharath Chitturi
04 July 2022, 17:41 IST

పెట్రోల్​, డీజిల్​ ధరలను మరింత తగ్గించడంపై మహారాష్ట్ర సీఎం ఏక్​నాథ్​ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఇంధనంపై వ్యాట్​ను తగ్గిస్తామని పేర్కొన్నారు.

Eknath Shinde : త్వరలోనే పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించనున్నట్టు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే ప్రకటించారు. ఈ మేరకు.. రాష్ట్ర అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో విజయం సాధించిన అనంతరం ప్రసంగించారు ఏక్​నాథ్​ షిండే. ఈ క్రమంలోనే ప్రజలకు గుడ్​ న్యూస్​ చెప్పారు.

"ఇంధనంపై వ్యాట్​ను తగ్గించే విషయాన్ని రాష్ట్ర కేబినెట్​ పరిశీలిస్తుంది. ఎంత తగ్గించాలనేది త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుంది," అని అసెంబ్లీకి చెప్పారు షిండే.

మహారాష్ట్ర రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్​ ధర ప్రస్తుతం రూ. 111.35గా ఉంది. ఔరంగాబాద్​లో ఆ ధర రూ. 111.99గా ఉంది. నాగ్​పూర్​లో పెట్రోల్ ధర రూ. 111.07, పుణెలో ధర రూ. 111.43గా ఉంది.​ ఇక మహారాష్ట్రలో డీజిల్​ ధర రూ. 96.34గా ఉంది.

ముఖ్యమంత్రి ప్రకటనతో రాష్ట్రంలో ఇంధనంపై ఎంత శాతం ధరలు తగ్గిస్తారు? అన్న అంశం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది.

'ఎవరిని మోసం చేయలేదు..'

తాను ఎవరిని మోసం చేయలేదని, కేవలం అన్యాయంపై పోరాటం చేశానని మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ షిండే ఉద్ఘాటించారు. తాను శివసేన కార్యకర్తనేనని, ఎప్పటికీ అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు.

"మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు.. నన్ను సీఎం చేయాలని అనుకున్నారు. కానీ ఎన్​సీపీ వ్యతిరేకించింది. పట్టు అంతా ఎన్​సీపీ వద్దే ఉండేది అనిపించింది. సావర్కర్​పై ఎన్నో ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ను మేము వ్యతిరేకించలేకపోయాము. కూటమిలో కాంగ్రెస్​ భాగం కదా. ఎన్​సీపీ- కాంగ్రెస్​తో ఏర్పడిన కూటమితో పార్టీ భవిష్యత్తుపై శివసేన శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. బీజేపీతో కలిసేందుకు గతంలో ఐదుసార్లు ప్రయత్నించాము. కానీ ఫలించ లేదు," అని ఏక్​నాథ్​ షిండే అన్నారు.