Anti love jihad act: త్వరలో 'లవ్ జిహాద్' కు, అక్రమ మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం
Anti love jihad act: వివాదాస్పద లవ్ జిహాద్ కు, అక్రమ మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు గానూ ఒక బిల్లును రూపొందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. గత ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అధికార మహాయుతి కూటమి 'లవ్ జిహాద్' అంశాన్ని తెరపైకి తెచ్చింది.

Anti love jihad act: ప్రేమికుల రోజుగా ప్రపంచ ప్రేమికులంతా పండుగ జరుపుకునే ఫిబ్రవరి 14న మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని ఏర్పాటు చేయడానికిి ప్రయత్నాలు ప్రారంభించింది. లవ్ జిహాద్, మోసపూరిత లేదా బలవంతపు మతమార్పిడులను నిరోధించడానికి ఒక ముసాయిదా బిల్లును రూపొందించమని బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర పోలీసు చీఫ్ రష్మీ శుక్లా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
లవ్ జిహాద్ ను అడ్డుకునేందుకు..
ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ఆకర్షించి, వారిని వివాహం చేసుకుని, లేదా వివాహం చేసుకోకుండానే వారితో బలవంతంగా మత మార్పిడి చేయించడాన్ని లవ్ జిహాద్ గా పేర్కొంటున్నారు. లవ్ జిహాద్ (love jihad) అనేది హిందూ జాతీయవాదులు ఉపయోగించే వివాదాస్పద పదం, ముస్లిం పురుషులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి హిందూ మహిళలను వివాహం చేసుకోవడానికి, వారిని ఇస్లాంలోకి మార్చడానికి ప్రలోభాలకు గురిచేస్తున్నారని నమ్ముతారు. ముస్లిం పురుషులను వివాహం చేసుకునే హిందూ అమ్మాయిలను నియంత్రించడమే మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలనే నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశమని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు.
బలవంతపు మత మార్పిడులు..
ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14, శుక్రవారం జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (GR) ప్రకారం, లవ్ జిహాద్, మతాంతర వివాహాలు, బలవంతపు మతమార్పిడుల గురించి అనేక మంది ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడంతో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాలు చేసిన ఇలాంటి చట్టాలను అధ్యయనం చేసి ముసాయిదాను తయారు చేస్తుంది. సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇది సూచిస్తుందని ఆ తీర్మానంలో ఉంది.
కమిటీ సభ్యులు వీరే..
ఈ కమిటీలో రాష్ట్ర పోలీసు చీఫ్ రష్మీ శుక్లాతో పాటు మహిళా శిశు సంక్షేమం, న్యాయ, మైనారిటీ సంక్షేమం, సామాజిక న్యాయం అనే నాలుగు రాష్ట్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హోం, న్యాయ శాఖలకు చెందిన మరో ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఎలాంటి గడువును విధించలేదు. మహారాష్ట్రలోని 48 పార్లమెంటరీ సెగ్మెంట్లలో 14 చోట్ల బలవంతపు మతమార్పిడులు జరిగాయని ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న భారతీయ జనతా పార్టీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ గత ఏడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. అనేక హిందూ మితవాద సంస్థలు, అలాగే నితేష్ రాణే వంటి బిజెపి నాయకులు "లవ్ జిహాద్"కు వ్యతిరేకంగా గళమెత్తారు. గత మహాయుతి ప్రభుత్వం లవ్ జిహాద్ కేసుల విచారణకు అప్పట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసినా పెద్దగా పురోగతి కనిపించలేదు.
విపక్షాల విమర్శలు
శుక్రవారం ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించిన జీఆర్ జారీ అయిన తర్వాత పలువురు ప్రతిపక్ష నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వాలెంటైన్స్ డే నాడే ఇది జారీ చేశారని, ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగి ఉండొచ్చని శివసేన (యూబీటీ) డిప్యూటీ లీడర్, అధికార ప్రతినిధి సుషామా అంధరే అన్నారు. ‘‘మహారాష్ట్రలో పరువు హత్యలను నిరోధించడానికి మతాంతర వివాహాలకు సేఫ్ హోమ్స్ అనే కాన్సెప్ట్ ను ఎందుకు ప్రవేశపెట్టారు? ఆ నిర్ణయానికి ఇది పూర్తి విరుద్ధమైన నిర్ణయం. ఇది హేతుబద్ధమైనదని చూపించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది’’ అని విమర్శించారు. ‘‘ప్రతి వివాహం లవ్ జిహాద్ కాదు. ఆత్మల దివ్య కలయిక అయిన ప్రేమ అన్ని నియమాలను ఉల్లంఘిస్తుంది. లవ్ జిహాద్ వ్యతిరేక చట్టాలు ఉన్నప్పటికీ మతాంతర వివాహాలు కొనసాగుతాయి’’ అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్) ప్రధాన అధికార ప్రతినిధి మహేశ్ తపసే అన్నారు. ‘‘మతం పేరుతో తీవ్రవాదానికి మేము వ్యతిరేకం. ముసాయిదా మా ముందుకు వచ్చినప్పుడు, మేము దానిని అధ్యయనం చేసి మా వైఖరిని తెలియజేస్తాం’’ అని మహాయుతి ప్రభుత్వంలో భాగమైన అజిత్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ పరాంజ్పే వ్యాఖ్యానించారు.