Maha kumbh Mela : అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలు- మహా కుంభమేళాలో 45కోట్ల మంది రక్షణకు ఏర్పాట్లు..
Maha kumbh mela 2025 date and place : మహా కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరీ ముఖ్యంగా భారీ స్థాయిలో భద్రత పరమైన చర్యలు చేపట్టింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రయాగ్‌రాజ్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు.. (PTI)
యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్న మహా కుంభమేళా ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ మహా కుంభమేళా నేడు, సోమవారం ప్రారంభంకానుంది. ఇందుకోసం యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. మరీ ముఖ్యంగా మహా కుంభమేళాకు హాజరయ్యే 45 కోట్ల మంది ప్రజల భద్రత కోసం ప్రయాగ్‌రాజ్ పోలీసులు కనీవినీ ఎరుగని విధంగా చర్యలు చేపట్టారు.

ప్రతి 12ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో జరిగే కార్యక్రమాల కోసం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
జిల్లాను పొరుగు ప్రాంతాలతో కలిపే ప్రధాన మార్గాలతో పాటు ప్రయాగ్‌రాజ్ చుట్టూ పటిష్టమైన భద్రతా ఫ్రేమ్‌వర్క్ కోసం ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
మహాకుంభమేళా 2025 ఏర్పాట్లు..
- సీఎం ఆదేశాలకు అనుగుణంగా ఏడు కీలక మార్గాల్లో 102 చెక్‌పోస్టులతో సర్క్యులర్ సెక్యూరిటీ వ్యవస్థను పోలీసులు ఏర్పాటు చేశారు. భద్రతలో వాహనాలు, వ్యక్తుల తనిఖీలు ఉంటాయి.
- ప్రతి ఒక్కరి భద్రతకు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు కట్టుబడి ఉన్నారని, 1,000 మందికి పైగా పోలీసులను మోహరించామని డీజీపీ ప్రశాంత్ కుమార్ నొక్కి చెప్పారు.
- 71 మంది ఇన్స్పెక్టర్లు, 234 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 645 మంది కానిస్టేబుళ్లు, 113 మంది హోంగార్డులు/పీఆర్డీ (ప్రాంతీయ రక్షక్ దళ్) జవాన్లు ఈ 2025 మహా కుంభమేళాను చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు.
- నిఘా పెంచేందుకు ఐదు వజ్ర వాహనాలు, 10 డ్రోన్లు, నాలుగు విధ్వంస నిరోధక బృందాలు 24 గంటలూ గస్తీ నిర్వహిస్తాయి.
- ఆలయాలు, అఖాడాలతో పాటు కీలక స్థావరాలను రక్షించడానికి ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ప్రయాగ్‌రాజ్ చుట్టూ "తిరుగులేని భద్రతా చక్రవ్యూహం" అని పిలిచే బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు.
- యూపీ పోలీసులతో పాటు రాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జ), ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ (పీఏసీ) సహకారంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
- అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసులు వినియోగిస్తున్నారు. కుంభమేళా ప్రాంతం చుట్టూ మొత్తం 2,700 ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను ఏర్పాటు చేశామని, 113 అండర్ వాటర్ డ్రోన్లతో జలమార్గాలను పర్యవేక్షిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
- 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ఈ మహాకుంభమే ఫిబ్రవరి 26న ముగియనుంది. జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (బసంత్ పంచమి) వంటి శుభదినాల్లో ప్రధాన స్నాన ఆచారాలు లేదా షాహీ స్నానం జరుగుతాయి.
- ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే మహాకుంభ్.. గంగ, యమునా, పౌరాణిక సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణీ సంగమానికి లక్షలాది మంది యాత్రికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.