Maha Kumbh Mela traffic : మాఘ పౌర్ణమి స్నానం కోసం మహా కుంభమేళాకు వెళుతున్న వారికి అలర్ట్!
మాఘ పౌర్ణమి వేళ మహా కుంభమేళాకు వెళుతున్న యాత్రికులకు అలర్ట్! భారీ ట్రాఫిక్ నేపథ్యంలో యూపీ అధికారులు అదనపు చర్యలు చేపట్టారు. మహా కుంభమేళా ప్రాంగణాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు.

మహా కుంభమేళా 2025లో భాగంగా మరో కీలక ఘట్టానికి ప్రయాగ్‌రాజ్ నగరం సన్నద్ధమవుతోంది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో ఫిబ్రవరి 12న కోట్లాది మంది ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించనున్నారు. ప్రయాగ్‌రాజ్ చుట్టూ ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తడటంతో మాఘ పౌర్ణమి స్నానాలకు అధికారులు అదనపు చర్యలు చేపట్టారు.
30 గంటల మేర ట్రాఫిక్ జామ్..!
గత రెండు రోజులుగా మహా కుంభమేళాకు వెళ్లే రహదారులు వాహనాలతో కిటకిటలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా, అనేక ప్రాంతాల్లో ప్రజలు 30 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకుపోయారు. సరిగ్గా ఈ సమయంలోనే మాఘ పౌర్ణమి స్నానాలు రావడంతో మాహ కుంభమేళాకు యాత్రికుల తాకిడి, ట్రాఫిక్ జామ్ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మహా కుంభ్ ప్రాంతాన్ని ‘నో వెహికల్ జోన్’గా ప్రకటించారు.
మహా కుంభమేళాకు వెళ్తున్న వేలాది భక్తులు మాఘ పౌర్ణమికి ముందు సోమవారం 300 కిలోమీటర్ల పొడవునా భారీ ట్రాఫిక్ జామ్‌లలో చిక్కుకున్నట్లు నివేదికలు వచ్చాయి. పరిస్థితి తీవ్రతను తెలియజేస్తూ, పోలీసులు సాధ్యమైతే ప్రజలను వెనుదిరిగి విళ్లిపోవాలని కూడా చెబుతున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. ట్రాఫిక్‌లో జాప్యం నిర్వహణలో లోపం వల్ల కాదని, మహా కుంభమేళాలో భక్తుల భారీ సంఖ్యే కారణం అని అన్నారు. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో యాత్రికుల రద్దీ ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోందని పేర్కొన్నారు.
జనవరి 13న మహా కుంభమేళా 2025 ప్రారంభమైనప్పటి నుంచి 40 కోట్లకు పైగా భక్తులు ఇప్పటికే సంగమంలో పవిత్ర స్నానం చేశారని, ప్రతిరోజూ లక్షలాది మంది ఇంకా వస్తున్నారని అధికారులు తెలిపారు.
మాఘ పౌర్ణమి కోసం మహా కుంభమేళా ట్రాఫిక్ అడ్వైజరీ..
మాఘ పౌర్ణమి స్నానం వేళ భక్తుల రద్దీ దృష్ట్యా మహా కుంభమేళా కోసంయంత్రాంగం ట్రాఫిక్ ప్రణాళికను సిద్ధం చేసింది.
- భక్తులు సులభంగా స్నానం చేసేందుకు ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల నుంచి మొత్తం మేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
- ఫిబ్రవరి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ప్రయాగరాజ్ నగరంలో కూడా నో వెహికల్ జోన్ అమల్లో ఉంటుంది. అత్యవసర సేవలు ఇందుకు మినహాయింపు.
- మహా కుంభమేళాలో పవిత్ర స్నానం కోసం ప్రయాగరాజ్ నగరానికి వెలుపల నుంచి వచ్చే భక్తుల వాహనాలను ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల తర్వాత సంబంధిత మార్గాల పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేస్తారు. అత్యవసర సేవలకు వాహనాలు ఈ ఏర్పాటు నుంచి మినహాయింపు ఉంటుంది.
- అడ్వైజరీలో పేర్కొన్న ట్రాఫిక్ ఏర్పాట్లు ఫిబ్రవరి 12న మేళా ప్రాంతం నుంచి భక్తులను సులభంగా ఖాళీ చేసే వరకు అమల్లో ఉంటాయి.
- ప్రయాగ్‌రాజ్ నగరం, మేళా ప్రాంతంలో వాహనాల ప్రవేశం- నిష్క్రమణపై ఉన్న నిబంధనలు ‘కల్పవాసి’ వాహనాలకు కూడా వర్తిస్తాయి
సంబంధిత కథనం