Maha Kumbh Mela : కట్టుదిట్ట భద్రత మధ్య మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం..
Amrit snan dates Maha kumbh 2025 : వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్ట భద్రతలను అధికారులు అమలు చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా 2025లో భాగంగా సోమవారం తెల్లవారుజామున అఖాడాలు మూడొవ 'అమృత్ స్నాన్'ని ప్రారంభించారు. గత శుభ స్నానం రోజున ఘోరమైన తొక్కిసలాట జరిగి కనీసం 30 మంది మరణించిన కొన్ని రోజుల తరువాత జరుగుతున్న ఈ మూడోవ అమృత స్నానానికి.. యూపీ అధికారులు అత్యంత కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మహా కుంభమేళాలో మూడొవ అమృత స్నానం..
ప్రమాద రహిత కార్యక్రమం నిర్వహించేందుకు అఖాడాలతో చర్చలు జరిపి కుంభమేళా నిర్వాహకులు.. పవిత్ర వసంత పంచమి రోజున చేపట్టే అమృత స్నానాల షెడ్యూల్ను నిర్ణయించారు. ప్రతి అఖాడాకు పవిత్ర జలాల వద్ద 40 నిమిషాల సమయాన్ని కేటాయించారు. మొదటి ఊరేగింపుతో వెళ్లేవారు వారి పనులు ముగించుకుని ఉదయం 8.30 గంటలకు వారి శిబిరాలకు తిరిగి వెళ్లే విధంగా ప్లాన్ చేశారు.
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా నగర్లోని సంగం వద్ద పోలీసులు గట్టి నిఘా ఉంచిన నేపథ్యంలో మహానిర్వాణి, అటల్ అఖాడాలు ఉదయం 4 గంటలకే స్నానఘట్టాలకు బయలుదేరారు.
సాధువులు ఊరేగింపుగా వెళ్లి పవిత్ర స్నానాలు ఆచరించి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 55 నిమిషాలలోపు తిరిగి వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. వారు వెళ్లిన తర్వాత సాధారణ ప్రజలకు పవిత్ర స్నానాలు చేసే అవకాశాన్ని కల్పిస్తారు.
మహా కుంభమేళా 2025 మూడొవ 'అమృత స్నానం' కోసం 'మహామండలేశ్వర్లు' లేదా వివిధ అఖాడాల అధిపతులు ఊరేగింపులకు నాయకత్వం వహిస్తున్న దృశ్యాలు కనిపించాయి. తెల్లవారే సమయానికి వివిధ అఖాడాల నుంచి బూడిద పూసిన నాగసాధువులు త్రివేణి సంగమం వైపు తమ ఉత్సవ ప్రయాణాన్ని ప్రారంభించారు.
వసంత పంచమి అమృత స్నాన్నాల షెడ్యూల్..
'మౌని అమావాస్య' రోజున గతంలో జరిగిన 'అమృత స్నానం' సందర్భంగా సంగం వద్ద జరిగిన తొక్కిసలాటలో కనీసం 30 మంది మరణించగా, 60 మంది గాయపడిన నేపథ్యంలో వసంత్ పంచమి పవిత్ర స్నానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎక్కువగా ఉందని పలువురు నమ్ముతున్న సంగం వద్దే గతంలో తొక్కిసలాట జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, ఎక్కడైనా పవిత్ర స్నానాలు చేయవచ్చని భక్తులకు సాధువులు, యూపీ అధికారులు అభ్యర్థిస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయానికి 16.58 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని, జనవరి 13 నుంచి స్నానమాచరించిన వారి సంఖ్య 34.97 కోట్లకు చేరుకుందని సమాచార సంచాలకుడు శిశిర్ తెలిపారు. వీరిలో 10 లక్షల మంది కల్పవాసీలు, 6.58 లక్షల మంది యాత్రికులు ఉన్నారని వివరించారు.
ఇప్పటివరకు 33 కోట్ల మంది భక్తులు మహా కుంభమేళాలో స్నానమాచరించారని, సోమవారం ఒక్కరోజే సుమారు ఐదు కోట్ల మంది యాత్రికులు వస్తారని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మౌని అమావాస్య తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భద్రత, క్రౌడ్ మేనేజ్మెంట్ చర్యలను కట్టుదిట్టం చేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం స్వయంగా ఏర్పాట్లను పరిశీలించడంతో సోమవారం 'జీరో ఎర్రర్' అమృత్ స్నాన్ కోసం అదనపు సిబ్బంది, వైద్య సిబ్బంది, వనరులను మోహరించారు.
సంబంధిత కథనం