Telugu News  /  National International  /  Maha Governor Dividing Hindus, It's Time To Decide If He Should Be Sent Back Home Or To Jail: Uddhav
శివ‌సేన చీఫ్‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే
శివ‌సేన చీఫ్‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే (HT PHOTO)

Maha governor viral comments | ``గుజ‌రాతీలు లేక‌పోతే ముంబై లేదు``

30 July 2022, 23:20 ISTHT Telugu Desk
30 July 2022, 23:20 IST

మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోషియారీ ముంబై పై చేసిన వ్యాఖ్య‌లు పెద్ద వివాదానికే తెర తీశాయి. శివ‌సేన చీఫ్ ఠాక్రే ఆ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ కోషియారీని రాష్ట్రం నుంచి పంపించేయ‌డ‌మో, జైలుకు పంప‌డ‌మో చేయాల‌ని విరుచుకుప‌డ్డారు. మ‌రాఠీ బిడ్డ‌ల‌ను ఆయన అవమానించార‌ని మండిప‌డ్డారు.

Maha governor viral comments | ముంబైలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోషియారీ మాట్లాడుతూ కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ముంబైలో, థానేలో ఒక‌వేళ గుజ‌రాతీలు, రాజ‌స్తానీలు లేక‌పోతే అస‌లు ముంబైనే లేద‌ని, ఇక్క‌డ ఎవ‌రూ మిగ‌ల‌ర‌ని, వారు లేకపోతే ముంబై దేశ ఆర్థిక రాజ‌ధాని కాలేక‌పోయేద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ట్రెండింగ్ వార్తలు

Maha governor viral comments | ఉద్ధ‌వ్ ఆగ్ర‌హం

గ‌వ‌ర్న‌ర్ చేసిన ఈ వ్యాఖ్య‌లు పెద్ద వివాదానికి తెర‌తీశాయి. మ‌రాఠీల‌ను ఆయ‌న అవ‌మానించార‌ని త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను వెన‌క్కు పంపాల‌ని శివ‌సేన చీఫ్‌, మ‌హారాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే డిమాండ్ చేశారు. గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌ను బీజేపీ స‌మ‌ర్ధిస్తుందా? అని ప్ర‌శ్నించారు. ముంబైలో క‌లిసి ఉంటున్న గుజ‌రాతీ, రాజ‌స్తానీ, మ‌రాఠీల‌ను విడ‌దీసే కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. మ‌రాఠా బిడ్డ‌ల‌ను గ‌వ‌ర్న‌ర్ అవ‌మానించార‌ని, ఆయ‌న‌ను రాష్ట్రం నుంచి పంపిస్తారా? లేక జైలుకు పంపిస్తారా? అని ఆగ్ర‌హంగా ప్ర‌శ్నించారు. మ‌రాఠాల‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఉన్న వ్య‌తిరేక‌త ఇలా బ‌య‌ట‌ప‌డింద‌న్నారు.

Maha governor viral comments | అవి వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు

గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌హారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు. ప్ర‌భుత్వంతో ఆయ‌న వ్యాఖ్య‌ల‌కు సంబంధం లేద‌ని, అవి ఆయ‌న‌ వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌ల‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. రాజ్యాంగ బ‌ద్ద ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఎవ‌రి మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని షిండే వ్యాఖ్యానించారు. మ‌రాఠాల కృష్టి, ప‌ట్టుద‌ల కార‌ణంగానే ముంబై ఈ స్థాయికి ఎదిగింద‌న్నారు.

Maha governor viral comments | ఆ ఉద్దేశంతో కాదు

మ‌రోవైపు, గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం కూడా ఒక వివ‌ర‌ణ విడుద‌ల చేసింది. ముంబై అభివృద్దిలో గుజ‌రాతీలు, రాజ‌స్తానీయుల సేవ‌ల‌ను ప్ర‌స్తావించ‌డ‌మే గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల ఉద్దేశ‌మ‌ని, మ‌రాఠాల‌ను అవ‌మానించే ఉద్దేశం లేద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో వివ‌రిచింది.

Maha governor viral comments | కోషియారీ.. జ‌రా హోషియారీ చూపు

గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ స్పందించారు. బీజేపీ స్పాన్స‌ర్ చేసిన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్ట‌గానే మ‌రాఠాల‌ను అవ‌మానించ‌డం ప్రారంభ‌మైంది` అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైరాం ర‌మేశ్ కూడా మ‌హారాష్ట్ర‌ గ‌వ‌ర్న‌ర్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. `ఆయ‌న పేరు కోషియారి. కాస్త హోషియారీ(తెలివి) చూపితే మంచిది` అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.