ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో అగ్నిప్రమాదం: 8 మందికి గాయాలు-madhya pradesh 8 injured in fire at ujjain mahakal temple shifted to indore for further treatment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో అగ్నిప్రమాదం: 8 మందికి గాయాలు

ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో అగ్నిప్రమాదం: 8 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu
Published Mar 25, 2024 11:20 AM IST

ఇండోర్, మార్చి 25: ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో సోమవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో గాయాలపాలైన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం ఇండోర్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

హాస్పిటల్ వద్ద క్షతగాత్రుల బంధువులు
హాస్పిటల్ వద్ద క్షతగాత్రుల బంధువులు (HT_PRINT)

ఇండోర్, మార్చి 25: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ గర్భగుడిలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో గాయాలపాలైన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం ఇండోర్లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఉదయం ఆలయంలోని గర్భగృహంలో భస్మ హారతి సందర్భంగా చెలరేగిన అగ్నిప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. భస్మ హారతి ప్రధాన అర్చకుడు సంజయ్ గురు సహా అర్చకులు, ఆలయ సిబ్బంది సహా గాయపడిన వారిని ఉజ్జయిని, ఇండోర్లోని ఆసుపత్రులకు తరలించినట్లు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ కుమార్ సింగ్ తెలిపారు.

ఉజ్జయిని మహాకాళ్ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం అరబిందో ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారని, కాసేపట్లో ఆయనే స్వయంగా అరబిందో ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను కలుస్తారని తెలిపారు.

క్షతగాత్రులంతా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, వారికి ఇక్కడ చికిత్స అందించేందుకు పూర్తి ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు.

'భస్మ హారతి' ఇక్కడ ప్రసిద్ధ ఆచారం. దీనిని 'బ్రహ్మ ముహూర్తం' సమయంలో తెల్లవారుజామున 3:30 నుండి 5:30 గంటల మధ్య నిర్వహిస్తారు.

మరోవైపు రాష్ట్ర మంత్రులు కైలాష్ విజయవర్గియా, తులసీరామ్ సిలావత్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

‘ప్రస్తుతం నేను ఇండోర్లోని అరబిందో ఆసుపత్రిలో ఉన్నాను. ఉజ్జయినిలోని మహాకాళ్ ఆలయ సముదాయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది అర్చకులకు గాయాలయ్యాయి. బాబా మహాకాల్ అనుగ్రహంతో అంతా బాగున్నారు. క్షతగాత్రులు కోలుకోవాలని ప్రార్థించాలి’ మంత్రి ప్రజలను కోరారు.

అంతకు ముందు పూజారి ఆశిష్ శర్మ ఏఎన్ఐతో మాట్లాడుతూ, "మహాకాల్ ఆలయంలో సాంప్రదాయ హోలీ వేడుకలు జరుగుతున్నాయి. 'గులాల్' కారణంగా 'గర్భగృహ'లో మంటలు వ్యాపించాయి. ఆలయ అర్చకులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించాం..’ అని వివరించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.