Crime news : ఆరుగురు కుటుంబసభ్యులను కిరాతకంగా చంపిన భార్యాభర్తలకు ఉరిశిక్ష..
యూపీలో ఐదేళ్ల క్రితం కలకలం రేపిన హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష పడింది. ఆస్తి కోసం సొంత కుటుంబంలోని ఆరుగురిని చంపిన దంపతులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో దాదాపు ఐదేళ్ల క్రితం జరిగిన ఒక దారుణ ఘటనలో దోషులకు తాజాగా ఉరిశిక్ష పడింది! సొంత కుటుంబంలోని ఆరుగురిని చంపిన దంపతులకు లక్నో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ఇదీ జరిగింది..
దాదాపు ఐదేళ్ల క్రితం ఆస్తి వివాదంలో తన తల్లిదండ్రులు, అన్నయ్య, అన్నయ భార్య, ఇద్దరు మైనర్ పిల్లలను ఓ వ్యక్తి చంపేశాడు. ఇందుకు అతని భార్య కూడా సహకరించింది.
అజయ్ సింగ్, అతని భార్య రూపా సింగ్‌లకు.. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 302 కింద ఉరిశిక్షతో పాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రోహిత్ సింగ్ తీర్పు చెప్పారు. ఈ కేసులో దంపతుల మైనర్ కుమారుడు కూడా నిందితుడిగా ఉన్నాడు. కానీ జువెనైల్ జస్టిస్ బోర్డులో అతని విచారణ ఇంకా ప్రారంభం కాలేదు.
ఈ ఘటన 2020 ఏప్రిల్ 30న లక్నో బంతారా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుదౌలి గ్రామంలో చోటుచేసుకుంది.
అజయ్ సింగ్ తన భార్య రూపా సింగ్, మైనర్ కుమారుడితో కలిసి అజయ్ అన్న అరుణ్ సింగ్, అతని భార్య రామ్ సఖి, వారి మైనర్ పిల్లలు (కుమారుడు, కుమార్తె), అజయ్ తల్లిదండ్రులు రామ్ దులారీ, అమర్ సింగ్‌లను గుడౌలీలోని తన ఇంట్లో హత్య చేసినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది.
"ఆస్తి కోసం తమ కుటుంబానికి చెందిన ఆరుగురిని హత్య చేసిన కేసులో అజయ్ సింగ్, అతని భార్య రూపా సింగ్‌లకు కోర్టు మరణశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు పరిగణించింది. వారి మైనర్ కుమారుడు కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతను జువైనల్ జైలులో ఉన్నాడు. కానీ విచారణ ఇంకా ప్రారంభం కాలేదు," అని జిల్లా ప్రభుత్వ న్యాయవాది మనోజ్ త్రిపాఠి చెప్పారు.
హత్యలకు ముందు.. ఆస్తి విషయంలో అజయ్ సింగ్ తన అన్న అరుణ్ సింగ్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగాడని, వారి తండ్రి అమర్ సింగ్ అరుణ్ (పెద్ద కుమారుడు) వైపు మొగ్గు చూపాడని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో అజయ్ కుటుంబ సభ్యులపై కొడవలితో దాడి చేసి తండ్రి, తల్లి, అన్న, భార్య, ఇద్దరు పిల్లలు - ఒక కుమారుడు, కుమార్తెను చంపాడు.
ఈ కేసు విచారణ సందర్భంగా అజయ్ సింగ్, అతని భార్య, కుమారుడు ప్రణాళికాబద్ధంగా హత్యలు చేసినట్లు కోర్టు నిర్ధారణకు వచ్చిందని త్రిపాఠి తెలిపారు.
అప్పట్లో ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే చంపేసిన దంపతులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
సంబంధిత కథనం