Employees : కుర్చీలో నుంచి పడిపోయి ఉద్యోగి మృతి.. సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మరో ఉద్యోగిని..-lucknow bank employee dies after falling off chair and another incident worker dies after boss refused her sick leave ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Employees : కుర్చీలో నుంచి పడిపోయి ఉద్యోగి మృతి.. సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మరో ఉద్యోగిని..

Employees : కుర్చీలో నుంచి పడిపోయి ఉద్యోగి మృతి.. సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మరో ఉద్యోగిని..

Anand Sai HT Telugu

Employees Death : ఉత్తరప్రదేశ్‌లో కుర్చీలో నుంచి కింద పడి ఆకస్మాత్తుగా ఓ మహిళా ఉద్యోగి మృతి చెందింది. మరో ఘటనలో థాయ్‌లండ్‌కు చెందిన మహిళ సిక్ లీవ్ ఇవ్వలేదని ఒత్తిడితో మృతి చెందిందని సహోద్యోగులు ఆరోపిస్తున్నారు.

పుణెలో పని ఒత్తిడితో యువ ఉద్యోగిని మృతి; కేంద్రం దర్యాప్తు

ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్ ఉద్యోగి మృతి ఘటన వైరల్‌గా మారింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న సదాఫ్ ఫాతిమా అనే మహిళా ఉద్యోగి పని సమయంలో కుర్చీ నుంచి కిందపడిపోయి మరణించినట్లు తెలుస్తోంది. ఆమె మరణానికి పని ఒత్తిడి కారణమని ఆమె సహచరులు పేర్కొన్నారు.

ఈ ఘటన మంగళవారం జరిగినట్లు సమాచారం. ఫాతిమా ఆఫీసులో పనిచేస్తుండగా హఠాత్తుగా కుర్చీపై నుంచి పడిపోయింది. వెంటనే సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. చాలా ఆందోళన కలిగిస్తోందని అన్నారు. 'పని ఒత్తిడి కారణంగా లక్నోలో ఒక మహిళా హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగి కార్యాలయంలో కుర్చీపై నుండి పడి మరణించిన వార్త చాలా ఆందోళన కలిగిస్తుంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఒత్తిడికి ఇలాంటి వార్తలు ప్రతీక అని. అన్ని కంపెనీలు, ప్రభుత్వ శాఖలు దీనిపై సీరియస్‌గా ఆలోచించాలి. ఇలాంటి ఆకస్మిక మరణాలు దారుణం.' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

థాయ్‌లాండ్‌లో ఉద్యోగి మృతి

థాయ్‌లాండ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. సుఖోథాయ్ ప్రావిన్స్‌కు చెందిన 30 ఏళ్ల మే అనే మహిళ.. సముత్ ప్రకాన్ ప్రావిన్స్‌లోని మువాంగ్‌లోని బ్యాంగ్ పు ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో ఉద్యోగిగా పని చేస్తుంది. ఆ మహిళా ఉద్యోగి మెుదట సిక్ లీవ్ తీసుకుంది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ సిక్ లీవ్ అడిగింది. మేనేజర్ ఇవ్వను అని చెప్పాడు. ఆ మరుసటి రోజు ఫ్యాక్టరీ వద్ద కుప్పకూలిపోయి మరణించింది.

ఆమెకు అనారోగ్యంతో ఉన్నా సెలవు ఇవ్వనందున మరణించిదని సహోద్యోగులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చనిపోయిన మహిళ స్నేహితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు పెద్దప్రేగులో మంటగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. తర్వాత మెడికల్ సర్టిఫికేట్‌తో మొదట సెప్టెంబరు 5 నుండి 9 వరకు సెలవు తీసుకుంది. నాలుగు రోజులు ఆసుపత్రిలోనే ఉంది.

ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత ఆమె ప రిస్థితి బాగోలేదని స్నేహితురాలికి చెప్పింది. ఆ తర్వాత మరో రెండు రోజులు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మేనేజర్‌కు తెలిపింది. ఇప్పటికే చాలా రోజులు అనారోగ్యంతో సెలవు తీసుకున్నందున పని చేయడానికి వచ్చి మరొక మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలని మేనేజర్ చెప్పాడు.

ఉద్యోగం పోతుందనే భయంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ పనికి వెళ్లింది. కేవలం 20 నిమిషాల పాటు పనిచేసిన తర్వాత ఆమె నేలకూలిందని ఆమె స్నేహితులు చెబుతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.