Miracle Baby : రెండు రోజులు అడవిలోనే ఒంటరిగా ఏడాది వయసు చిన్నారి.. దగ్గరలోనే అన్న శవం
Miracle Baby In Louisiana : లూసియానాలో తప్పిపోయిన చిన్నారి కోసం గాలింపు చర్యలకు తెరపడింది. రెండు రోజులు అన్నం, నీరు లేకుండా ఏడాది వయసు చిన్నారి అడవిలో గడపడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే దగ్గరలోనే చిన్నారి సోదరుడి శవం కూడా దొరికింది.
రెండు రోజులు తిండి, నీరు లేకుండా అమెరికాలోని లూసియానాలో ఏడాది వయసు చిన్నారి ఒంటరిగానే అడవిలో గడిపాడు. దగ్గరలోనే అతడి అన్నం శవం కూడా దొరికింది. అతడిని మిరాకిల్ బేబిగా పోలీసులు చెబుతున్నారు. అసలు ఆ చిన్నారి అడవిలోకి ఎందుకు వెళ్లాడు? అతడి అన్న శవంగా ఎందుకు అయ్యాడు? వివరాలు తెలుసుకుందాం..
వింటన్ వెల్‌కమ్ సెంటర్ సమీపంలో చెరువులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్టుగా కల్కషియు పారిష్ షెరిష్ ఆఫీసుకు ఫోన్ కాల్ వచ్చింది. నాలుగేళ్ల బాలుడి మృతదేహం దొరికిన విషయాన్ని పోలీసులు ప్రకటించారు. దీంతో మీడియాలో కథనాలు వచ్చాయి.
మీడియాలో వచ్చిన కథనాలు చూసి.. బాలుడి అమ్మమ్మ షెరిఫ్ కార్యాలయానికి ఫోన్ చేశారు. చనిపోయిన బాలుడికి తమ్ముడు ఉన్నాడని కూడా చెప్పారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బాలుడి శవం దొరికిన రోజే చిన్నారుల తల్లి ఆలియా జాక్‌ను మిస్సిస్సిప్పీలో అరెస్టు చేశారు. తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదు చేయలేదన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఏడాది వయసు చిన్నారి కోసం అధికారులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఫలితం లేదు. ఇదే సమయంలో టెక్సాస్-లూసియానా సరిహద్దుకు సమీపంలో ఇంటర్‌స్టేట్-10 రహదారిపై వెళ్తున్న ఒక ట్రక్కు డ్రైవర్ హైవే వెంబడి గుంతలో చిన్నారి కనిపించినట్టుగా పోలీసులకు సమచారం ఇచ్చాడు.
దీంతో వెంటనే రంగంలోకి దిగిని పోలీసులు ఏడాది వయసు చిన్నారి ఆచూకీ కనుగొన్నారు. అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అతడి శరీరం నిండా పురుగులు కుట్టిన గుర్తులు ఉన్నాయి. కానీ క్షేమంగా ఉన్నాడు. రెండు రోజులు ఆహారం, నీరు లేకుండానే అడవిలో తిరిగాడు. అయితే వాతావరణం వేడిగా లేకుండా చల్లగా ఉండటంతో బాబు ఇబ్బంది పడలేదు.
ఈ కేసు అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈ చిన్నారులు అడవిలో దొరకడానికి కొద్ది రోజుల ముందు తన అమ్మమ్మ కాన్స్‌వెల్లా దగ్గరే ఉన్నారు. కాన్స్ వెల్లా కుమార్తె ఆలియా జాక్. ఆలియా ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఓ రోజు ఇంటికి వచ్చి అమ్మమ్మ దగ్గర నుంచి పిల్లలిద్దరినీ తీసుకెళ్లింది. తర్వాత కుమార్తెకు కాన్స్‌వెల్లా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయలేదు. పిల్లలు కారులో ఉన్న ఫోటోలను మాత్రమే పంపింది. ఆ తర్వాత పిల్లలు ఇద్దరు తప్పిపోయారు.
ఈ ఘటనలో ఇప్పటికే ఆలియా జాక్ అరెస్ట్ అయింది. పిల్లలను తల్లే అడవిలో వదిలేసి వెళ్లిపోయిందా? వేరే ఘటన ఏదైనా జరిగిందా తెలియాల్సి ఉంది. బాలుడి మరణానికి కారణాలు తెలియరాలేదని, పోస్టుమార్టం తర్వాత వివరాలు వెల్లడవుతాయని అధికారులు చెబుతున్నారు. మిరాకిల్ బేబి మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.