Los Angeles wildfires : అగ్నికి ఆహుతవుతున్న లాస్ ఏంజెల్స్- 10 మంది మృతి!
Los Angeles wildfires : అమెరికా లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు అందరిని వణికిస్తోంది. ఇప్పటికే వేల ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. కార్చిచ్చుకు 10మంది ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా కాలిఫోర్నియాను కార్చిచ్చు వణికిస్తోంది! మరీ ముఖ్యంగా లాస్ ఏంజిల్స్‌లో పరిస్థితులు అత్యంత విషమంగా ఉన్నాయి. కాార్చిచ్చు ధాటికి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 10కి చేరింది. మరో 1,80,000 మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయాలని ఆదేశించినట్లు అధికారులు ఆదేశాలిచ్చారు. పొగతో నిండిన లోయలు, హాలీవుడ్ ప్రముఖులు- క్రీడా ప్రముఖులు నివసించే సుందరమైన పరిసరాలు అగ్నికి ఆహుతయ్యాయి.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం..
మంగళవారం మొదలైన వరుస మంటలు దక్షిణ కాలిఫోర్నియాను అతలాకుతలం చేస్తూనే ఉన్నాయి. అమెరికా సినీ పరిశ్రమ 'హాలీవుడ్'కు నిలయమైన లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో మరింత విధ్వంసం జరుగుతోంది.
మరోవైపు అమెరికా కార్చిచ్చుకు కచ్చితమైన మరణాల సంఖ్య అస్పష్టంగా ఉన్నప్పటికీ, సహాయక బృందాలు శిథిలాల కోసం గాలిస్తుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
బలమైన గాలుల కారణంగా చెలరేగిన అనేక అగ్నిప్రమాదాలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ పోరాడుతున్నారు. ఇది విస్తృతమైన విధ్వంసం, ప్రాణ నష్టానికి దారితీసింది.
ఆమెరికాలోని ఈ కార్చిచ్చు సామాన్యులనే కాదు, అనేక మంది హాలీవుడ్ ప్రముఖులను సైతం గడగడలాడిస్తోంది. విలాసవంతమైన ప్రాంతాల్లోని అనేక ఇళ్లు కార్చిచ్చుకు నాశనం అయ్యాయి.
ఇప్పటికే 10వేలకు పైగా నిర్మాణాలు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు అధికారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.
'శాంటా అనా' అని పిలిచే శక్తివంతమైన పొడి గాలుల వల్ల మంగళవారం ప్రారంభమైన అనేక భారీ మంటలు కొన్ని చోట్ల 70 మైళ్ల (112 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో విస్తరించాయి.
“గాలులు గురువారం తగ్గుముఖం పట్టాయి. అయితే గాలులు తగ్గినా కూడా ఇంకా వేగంగా మంటలు వ్యాపిస్తాయని, గురువారం సాయంత్రం గాలులు మళ్లీ బలపడే అవకాశం ఉంది,” అని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది.
ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దారుణం..
పసిఫిక్ పాలిసాడెస్, ప్రముఖ గృహాలు, పసడేనా, అల్టాడెనా వంటివి లాస్ ఏంజిల్స్ కార్చిచ్చులో అత్యంత ప్రభావితమైన ప్రాంతాలుగా ఉన్నాయి. పసిఫిక్ పాలిసేడ్స్‌లో 5,300కు పైగా నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఇది లాస్ ఏంజిల్స్ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన అగ్నిప్రమాదంగా నిలిచింది.
డజన్ల కొద్దీ బ్లాకులు దగ్ధమైన శిథిలాలతో నేలమట్టమయ్యాయి. ఇళ్ల చిమ్నీలు మాత్రమే మిగిలిపోయాయి.
పసిఫిక్ పాలిసేడ్స్‌లో 30 చదరపు మైళ్ల (77 చదరపు కిలోమీటర్లు) మంటలు చెలరేగాయి.
దోపిడీలు..
ఓవైపు కార్చిచ్చు అందరిని భయపెడుతుంటే.. మరోవైపు విలాసవంతమైన ప్రాంతాల్లో దోపిడీ ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు.
లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా.. రాత్రిపూట కర్ఫ్యూ ప్రణాళికలను ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడానికి నేషనల్ గార్డ్ దళాలను మోహరించారు. ఖాళీ అయిన ప్రంతాలను నేషనల్ గార్డ్ సహా అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించి రక్షించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉందని గవర్నర్ గావిన్ న్యూసమ్ నొక్కి చెప్పారు.
"ఖాళీగా ఉన్న సొసైటీలను దోచుకోవాలని చూస్తున్న వారికి నేను ఒక్కటే చెబుతున్నాను.. దోపిడీని సహించముస" అని న్యూసమ్ అన్నారు.
సంబంధిత కథనం