Los Angeles wildfire: అమెరికాలోని లాస్ ఏంజిల్స్ శివారులో ప్రమాదకరమైన కార్చిచ్చు చెలరేగింది. ఈ కార్చిచ్చు కారణంగా 3 వేల ఎకరాల్లో ఇళ్లు నాశనమయ్యాయి. సుమారు 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. లాస్ ఏంజిల్స్ శివారులోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలో ఈ కార్చిచ్చు సంభవించింది. ఈ కార్చిచ్చుతో ఇప్పటివరకు దాదాపు 3,000 ఎకరాల (1,200 హెక్టార్లు) ప్రాంతం నాశనం అయింది.
అమెరికాలోని (usa news telugu) లాస్ ఏంజిల్స్ శివారులో చెలరేగిన కార్చిచ్చు మంటలు సమీప ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. హరికేన్ గాలులు పరిస్థితిని మరింత దిగజార్చాయని, మంటలు చెలరేగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కార్చిచ్చును ఆర్పేందుకు చాపర్లతో నీటిని వెదజల్లుతున్నారు. మరోవైపు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే, సహాయ చర్యలపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కార్చిచ్చు చుట్టుముట్టిన ప్రాంతంలో పెద్ద ఎత్తున సెలబ్రిటీలు (celebrities) , హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. శాంటా మోనికా మౌంటెయిన్స్ లో మిలియన్ డాలర్ల విలువైన విల్లాలతో నిండిన ప్రాంతాన్ని మంటలు మరింత చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో భీకర గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. బిఎమ్ డబ్ల్యూ (BMW), టెస్లా, మెర్సిడెస్ వంటి లగ్జరీ కార్లు కార్చిచ్చుతో దగ్ధమయ్యాయి. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. బుల్డోజర్లను ఉపయోగించి వాహనాలను దూరంగా తరలించారు.
ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు నమోదు కాలేదు. స్వల్ప గాయాలు మినహాయిస్తే, తీవ్ర స్థాయిలో ఎవరూ క్షతగాత్రులు కాలేదు. 30,000 మందికి పైగా ప్రజలను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ చీఫ్ క్రిస్టిన్ క్రౌలీ తెలిపారు.