లాస్ ఏంజిల్స్‌లో ఇంకా ఆరని అగ్గి.. 16 మంది మృతి, ఓ వైపు నీటి కొరత, మరోవైపు దొపిడీలు!
Los Angeles Fire : యూఎస్‌లోని లాస్ ఏంజిల్స్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదం వేగంగా నివాస ప్రాంతాల వైపు కదులుతోంది. బలమైన గాలులు టెన్షన్ పెంచుతున్నాయి. రాబోయే రోజుల్లో మంటలను అదుపు చేయకపోతే వేలాది ఇళ్లు దగ్ధమయ్యే ప్రమాదం కనిపిస్తుంది.
యూఎస్ లాస్ ఏంజిల్స్ కౌంటీలో కార్చిచ్చు వ్యాప్తిని అరికట్టడం చాలా కష్టంగా మారింది. బలమైన గాలులు సమస్యను మరింతగా పెంచాయి. గాలుల కారణంగా మంటలు వేగంగా నివాస ప్రాంతం వైపు కదులుతున్నట్లు తెలుస్తోంది. నగరాలకు మంటలు వ్యాపిస్తే పెద్ద సంఖ్యలో ఇళ్లు దగ్ధమవుతాయి. దాదాపు 12 వేల ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ హిల్స్‌లోని పలువురు తారల బంగ్లాలు కూడా ఈ అగ్నికి నాశనం అయ్యాయి.

16 మంది మృతి
ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటి వరకు 16 మంది చనిపోయారు. మృతుల్లో పదకొండు మంది ఎటోన్ ఫైర్‌కు చెందిన వారు కాగా, ఐదుగురు పాలిసాడెస్‌లో ఆహుతయ్యారు. మంగళవారం సాయంత్రం సంభవించిన ఎటోన్ అగ్నిప్రమాదం అల్టాడెనా, పసడెనా సమీపంలో 14,117 ఎకరాలను నాశనం చేసింది. అయితే శనివారం మధ్యాహ్నానికి 15 శాతం మంటలు అదుపులోకి వచ్చాయి. లాస్ ఏంజిల్స్ ప్రాంతంలో మంగళవారం నుండి 22,660 ఎకరాలు కాలిపోయిన, 5,300 కంటే ఎక్కువ గృహాలను నాశనం చేసిన ఐదు కార్చిచ్చులలో పాలిసాడెస్ అగ్నిప్రమాదం అతిపెద్దది. ఇప్పటి వరకు 11 శాతం మంటలను ఆర్పివేశారు.
మంటలు పెరిగే అవకాశం
మోస్తరు నుంచి బలమైన గాలులు వీస్తాయని, దీంతో మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ మాట్లాడుతూ.. అగ్నిమాపక చర్యలకు సహాయపడటానికి కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ మోహరింపును రెట్టింపు చేస్తున్నామని, లాస్ ఏంజిల్స్ మంటలను ఎదుర్కోవడానికి ప్రజా భద్రతా వనరులను మోహరించామని తెలిపారు. 1,680 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్ మెన్ ప్రస్తుతం ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని చెప్పారు.
గాలుల కారణంగా తూర్పు దిశగా వేగంగా కదులుతోందని సమాచారం. ఎంత ప్రయత్నించినా మంటలను అదుపు చేయడం కష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. మంటలు ఇలాగే పెరిగితే గెట్టి సెంటర్ ఆర్ట్ మ్యూజియం, జనసాంద్రత అధికంగా ఉండే శాన్ ఫెర్నాండో లోయ కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
నీటి కొరత
మంటలను ఆర్పే ప్రయత్నాల మధ్య నీటి గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇళ్లను మంటల బారి నుంచి కాపాడాలని ప్రయత్నించినా నీటి కొరత ఏర్పడుతుంది. లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్ తారల ఇళ్లు, బంగ్లాలు ఎలా ధ్వంసమయ్యాయనే దానిపై విచారణ జరపాలని కాలిఫోర్నియా గవర్నర్ అన్నారు. పలు చోట్ల అగ్నిప్రమాదాల మధ్య దోపిడీ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెయింట్ మోనికాలో కర్ఫ్యూ విధించారు.