Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్ ఎన్నికః పార్టీల బలాబలాలు
లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. స్వతంత్య్రం వచ్చిన తరువాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం ఇది మూడో సారి. ఈనేపథ్యంలో సభలో ఏయే పార్టీకి ఎంత బలం ఉందో ఇక్కడ చూద్దాం.

లోక్‌సభ స్పీకర్ పదవికి ఇండియా కూటమి అభ్యర్థి పోటీ చేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బరిలో అధికార ఎన్‌డీఏ తరపున బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ప్రతిపక్ష ఇండియా కూటమి తరపున కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేష్ ఉన్నారు.
ప్రతిపక్ష పార్టీల తరపున అభ్యర్థి పోటీ చేయడంతో స్వాతంత్య్రం వచ్చిన తరువాత మూడోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది. రేపు ఈ ఎన్నిక జరగనుంది.
ఎప్పుడెప్పుడు ఎన్నిక జరిగింది?
1952లో తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా, 1976లో రెండోసారి ఎన్నిక జరిగింది. మళ్లీ 50 ఏళ్ల తరువాత ఇప్పుడు లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతోంది. ఈ మూడుసార్లు మినహాయిస్తే ఎప్పుడూ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే అవుతూ వస్తోంది. అధికారం పక్షానికి చెందిన నేతే స్పీకర్ అవుతారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే గత పదేళ్లుగా ప్రతిపక్షాలకు ఇవ్వడం లేదు.
2014-19 (మోడీ మొదటి ప్రభుత్వం) మధ్య తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకేకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఆ కాలంలో అన్నాడీఎంకే ఎంపీ తంబిదొరై డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. అప్పటికి అన్నాడీఎంకే ఎన్‌డీఏ భాగస్వామి కాదు.
ఇక 2019-24 మధ్య (మోడీ రెండో ప్రభుత్వం) అసలు డిప్యూటీ స్పీకర్ పదవి భర్తీ చేయలేదు. దాన్ని గత ఐదేళ్లుగా ఖాళీగానే ఉంచారు. ఆ మధ్యలో వైసీపీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని మీడియాలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. కానీ చివరికి ఎవ్వరికీ ఆ పదవి ఇవ్వకుండా ఖాళీగానే ఉండిపోయింది.
అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి గణనీయమైన సీట్లను సాధించింది. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సాధించింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తాము స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష పార్టీలు షరతు పెట్టాయి. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నారని మీడయాలో కథనాలు వచ్చాయి. అయితే చివరకు అవి ఊహగణాలేనని స్పష్టమైంది.
డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వడానికి మోడీ సర్కార్ సిద్ధపడలేదు. కాగా ప్రతిపక్షాలతో చర్చించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. కానీ సంప్రదింపులు విఫలం అయ్యాయి. దీంతో ప్రతిపక్షాల ఫోరం ఇండియా తరపున కాంగ్రెస్ ఎంపి కె.సురేష్ బరిలోకి దిగారు. స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యం అయింది.
పార్టీల బలాబలాలు
లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభలోని అధికార, ప్రతిపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది. లోక్‌సభలో 543 మంది సభ్యుల్లో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. రాహుల్ గాంధీ గెలుపొందిన రెండో స్థానం కేరళలోని వయనాడ్‌కు రాజీనామా చేశారు. దీంతో ఒక స్థానం ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం 542 మంది ఎంపీలు ఉన్నారు. ఇందులో ఎన్‌డీఏకి 293 మంది ఎంపీల బలం ఉండగా, ఇండియా కూటమి పార్టీలకు 233 మంది ఎంపీల బలం ఉంది. రెండు కూటముల్లో ఏ కూటమికి చెందని వారు 16 మంది ఉన్నారు.
ఎన్‌డీఏలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు
ఏన్‌డీఏలో బీజేపీకి 240, టీడీపీకి 16, జేడీయూకి 12, శివసేన (షిండే)కు 7, ఎల్‌జేపీకి 5, జేడీఎస్‌కు 2, జనసేనకు 2, ఆర్ఎల్‌డీకి 2, ఎన్‌సీపీ (అజిత్ పవర్)కి 1, అప్నాదల్‌కు 1, ఏజేపీకి 1, ఏజేఎస్‌యూకు 1, హెచ్ఏఏంకు 1, ఎస్‌కేఎంకు 1, యూపీపీఎల్‌కు 1 సభ్యులు ఉన్నారు.
ఇండియా కూటమిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు
ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు 98, ఎస్‌పీకి 37, టీఎంసీకి 29, డీఎంకేకు 22, శివసేన (ఠాక్రే)కు 9, ఎన్‌సీపీ (శరద్‌పవర్)కి 8, సీపీఎంకు 4, ఆర్‌జేడీకి 4, ఆప్‌కు 3, ఐయూఎంఎల్‌కు 3, జేఎంఎంకు 3, సీపీఐకి 2, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్‌కు 2, నేషనల్ కాన్ఫెరెన్స్‌కు 2, వీసీకెకు 2, ఆర్ఎస్‌పీకి 1, ఎండీఎంకెకు 1, కేరళ కాంగ్రెస్‌కు 1, ఆర్ఎల్‌పీకు 1, బీఎపీకు 1 సభ్యులు ఉన్నారు.
ఏ కూటమికి చెందని పార్టీల సీట్లు
ఏ కూటమికి చెందని సభ్యులు 16 మంది ఉన్నారు. అందులో వైసీపీకి 4, శిరోమణి అకాలీదళ్‌కి 1, వీవీపీకి 1, జెడ్‌పీఎంకి 1, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి 1, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. స్వతంత్రుల్లో మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఇండిపెండెంట్ ఎంపి విశాల్ పాటిల్ కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయన మద్దతు కూడా ఇండియా కూటమికే ఉంటుంది.
బీహార్ నుంచి స్వతంత్ర సభ్యునిగా ఎన్నికైన పప్పు యాదవ్, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇండియా కూటమి అభ్యర్థికే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ, అటు కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి. బుధవారం ఉదయం 11 గంటలకే సభ్యులంతా సభకు హాజరుకావాలని సూచించాయి.
సభలో ప్రాతినిధ్యం లేని ప్రధాన పార్టీలు
18వ లోక్‌సభలో కొన్ని ప్రధాన పార్టీలు ప్రాతినిధ్యం పొందలేకపోయాయి. అందులో తెలంగాణలోని బీఆర్ఎస్, ఒడిశాలోని బీజేడీ, తమిళనాడులోని అన్నాడీఎంకే, ఉత్తరప్రదేశ్‌లోని బీఎస్‌పీ, హర్యానాలోని జేజేపీ, జమ్మూకాశ్మీర్‌లోని పీడీపీ వంటి పార్టీలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు.
ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా రాజకీయ ప్రస్థానం
ఓం బిర్లా 1962 నవంబర్ 23న జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన బిర్లా బీజేపీ, దాని అనుబంధ సంఘాల్లో అనేక పదవులు నిర్వర్తించారు. 2003లో కోటా సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన ఆయన విజయం సాధించారు. 2008లో కూడా అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు. మూడోసారి 2013లో ఆయన అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందారు.
అయితే ఆ తరువాత 2014 లోక్‌సభ ఎన్నికలు ఆయన కోట లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2019, 2024 ఎన్నికల్లో కూడా కోట నియోజకవర్గం నుంచే ఆయన పోటీ చేసి గెలుపొందారు. 2019లో రెండో సారి లోక్‌సభకు ఎన్నికైన ఆయన అనుహ్యంగా లోక్‌సభ స్పీకర్ పదవి దక్కింది. 2019 నుంచి 2024 వరకు ఆయన లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన స్పీకర్‌గా ఉన్నప్పుడే దేశ చరిత్రలో అత్యధిక మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను సస్పెండ్ చేసిన ఘటన జరిగింది.
ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కె.సురేష్ రాజకీయ ప్రస్థానం
కె.సురేష్ 1962 జూన్ 4న కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్‌లో పేద కుటుంబంలో జన్మించారు. ఎల్ఎల్‌బి పట్టభద్రుడైన సురేష్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ పదవులను చేపట్టారు. కె.సురేష్ 1989, 1991, 1996, 1999 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2004 ఎన్నికల్లో ఓటమి చెందిన సురేష్ 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. మొత్తం ఆయన రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2009లో ఆయన విజయంపై కుల వివాదం నెలకొంది. ఆయన కుల ధృవీకరణ పత్రం నకిలీదని, ఆయన క్రైస్తవుడని ఆరోపణలు వచ్చాయి. హైకోర్టు ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత ప్రకటించింది. అయితే దీన్ని సుప్రీం కోర్టు కొట్టివేసింది.
రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు