MP Disqualification: ఎంపీపై అనర్హత వేటు ఎత్తివేత.. సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్‍సభ-lok sabha restores disqualified mp mohammad faizal membership here is why ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mp Disqualification: ఎంపీపై అనర్హత వేటు ఎత్తివేత.. సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్‍సభ

MP Disqualification: ఎంపీపై అనర్హత వేటు ఎత్తివేత.. సభ్యత్వాన్ని పునరుద్ధరించిన లోక్‍సభ

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 29, 2023 03:06 PM IST

MP Disqualification: ఓ ఎంపీపై అనర్హత వేటును ఎత్తేసింది లోక్‍సభ. మహమ్మద్ ఫైజల్(Mohammad Faizal).. లోక్‍సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించింది.

ఎంపీ మహమ్మద్ ఫైజల్ (HT Photo)
ఎంపీ మహమ్మద్ ఫైజల్ (HT Photo)

MP Disqualification: కాంగ్రెస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై పడిన అనర్హత వేటు రాజకీయ దుమారాన్ని సృష్టిస్తున్న తరుణంలో.. ఓ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‍సభ పునరుద్ధరించింది. గతంలో ఎంపీగా అనర్హతకు గురైన ఆయన తిరిగి తన పదవిని పొందారు. లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్ (Mohammed Faizal).. సభ్యత్వాన్ని లోక్‍సభ నేడు పునరుద్ధరించింది. ఆయనపై గతంలో వేసిన అనర్హత వేటును ఎత్తేసింది. ఓ క్రిమినల్ కేసులో దోషిగా తేలటంతో ఫైజల్‍కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ఈ శిక్షను కేరళ హైకోర్టు నిలుపుదల చేయడంతో ఆయన మళ్లీ లోక్‍సభ సభ్యత్వాన్ని పొందగలిగారు. పూర్తి వివరాలివే..

హత్యాయత్నం నేరంపై..

లక్షద్వీప్ (Lakshadweep) నుంచి 2019 లోక్‍సభ ఎన్నికల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) తరఫున పోటీ చేసి గెలిచారు మహమ్మద్ ఫైజల్. అయితే, 2009లో కాంగ్రెస్‍కు చెందిన ఓ కార్యకర్తపై హత్యాయత్నం చేశారంటూ 2016లో ఫైజల్‍పై కేసు నమోదైంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఆయన లక్షద్వీప్ లోక్‍సభ స్థానం నుంచి గెలిచారు. అయితే, ఆ కేసు తీర్పు తీర్పు ఈ ఏడాది జనవరి 11న వచ్చింది. ఆయనను దోషిగా తేలుస్తూ పదేళ్ల జైలు శిక్ష విధించింది కవరట్టి జిల్లా కోర్టు. దీంతో రెండేళ్లు.. అంత కంటే కాలం ఎక్కువ జైలుశిక్ష పడితే లోక్‍సభ సభ్యత్వానికి అనర్హులేనన్న నిబంధన అమలైంది. ఆయనపై అనర్హత వేటు వేసింది లోక్‍సభ.

లక్షద్వీప్ స్థానానికి పోలింగ్ నిర్వహించేందుకు జనవరి 18న ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. జనవరి 27న పోలింగ్ జరగాల్సింది. అయితే పోలింగ్‍కు రెండు రోజుల ముందు.. ఫైజల్‍పై పడిన 10 ఏళ్ల జైలు శిక్షను నిలిపివేస్తూ కేరళ హైకోర్టు (Kerala High Court) నిర్ణయం తీసుకుంది. దీంతో ఫైజల్‍పై వేసిన అనర్హతను వెనక్కి తీసుకోవాలని లోక్‍సభ స్పీకర్ ఓం బిర్లాను ఎన్‍సీపీ అధినేత శరద్ పవార్ కోరారు.

సుప్రీం విచారణకు ముందు..

అయితే, తనపై పడిన శిక్షను కేరళ హైకోర్టు సస్పెండ్ చేసి రెండు నెలలు గడుస్తున్నా.. లోక్‍సభ తనపై అనర్హత వేటు ఎత్తేయకపోవటంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు మహమ్మద్ ఫైజల్. లోక్‍సభ సెక్రటేరియట్‍కు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిషన్‍ విచారణకు వచ్చే ముందే లోక్‍సభ స్పందించింది. ఎంపీగా మహమ్మద్ ఫైజల్‍పై వేసిన అనర్హతను ఎత్తేస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది.

రాహుల్ గాంధీ విషయంలో..

Rahul Gandhi Disqualification: 2019లో మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ప్రముఖ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు గత వారం దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఎంపీగా ఆయనపై అనర్హత వేటు వేసింది లోక్‍సభ సెక్రటేరియట్. దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం కక్షసాధింపు చేస్తోందని, రాహుల్‍కు భయపడుతోందని కాంగ్రెస్ అంటోంది. అయితే, రాహుల్‍పై అనర్హత విషయంపై పైకోర్టుకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పుడు మహమ్మద్ ఫైజల్ ఉదంతాన్ని.. కోర్టులో ప్రస్తావించాలని అనుకుంటోంది. రాహుల్‍పై అనర్హత విషయంలో లోక్‍సభది తొందరపాటు చర్య అని వాదించే అవకాశం ఉంది.

సంబంధిత కథనం