Liquor prices: మందు ప్రియులకు షాక్; మళ్లీ పెరగనున్న మద్యం ధరలు
Liquor prices: కర్నాటకలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. త్వరలో రాష్ట్రంలో మద్యం ధరలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక ప్రకటన చేశారు.
పొరుగు రాష్ట్రాల్లోని ధరలకు పోటీగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో మద్యంపై (liquor prices) పన్ను శ్లాబులను సవరించనుంది. బడ్జెట్ సమర్పణ సందర్భంగా సీఎం సిద్దరామయ్య దీనికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. వివిధ కేటగిరీల మద్యానికి పన్ను శ్లాబులు త్వరలో సవరించి, ప్రకటిస్తామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.
బీర్ల రేటు పెరిగే అవకాశం
బడ్జెట్ సమర్పణ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఇండియన్ మేడ్ లిక్కర్ (IML), బీర్లపై పన్ను శ్లాబులను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. పన్ను శ్లాబులను హేతుబద్ధీకరించడం, పొరుగు రాష్ట్రంతో పోలిస్తే ధరలను పోటీ పడేలా చేయడం దీని ఉద్దేశం అని వివరించారు. సమీక్ష అనంతరం, కొత్త పన్ను స్లాబ్స్ అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బీరు (BEER PRICE HIKE), ఇతర ఐఎంఎల్ డ్రింక్స్ ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలతో పోటీ పడేలా చేస్తే ప్రీమియం మద్యం రేట్లు మాత్రం తగ్గే అవకాశం ఉంది.
ధరల్లో కర్నాటక టాప్
మద్యం ధరల విషయంలో దేశంలోనే కర్నాటక అగ్రస్థానంలో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటక లో గరిష్ట రిటైల్ ధర (MRP)పై పన్ను కూడా ఎక్కువగా ఉంది. కర్ణాటక మద్యం వాస్తవ ధర పై గరిష్టంగా 83% పన్ను విధిస్తుంది. ఇది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ. కర్నాటక లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూలైలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొత్తం 18 శ్లాబుల ఇండియన్ మేడ్ లిక్కర్ (IML)పై పన్నును 20 శాతం, బీర్ పై సుంకాన్ని 10 శాతం పెంచారు. అలాగే, ఎక్సైజ్ శాఖ ఆదాయ టార్గెట్ ను రూ. 36 వేల కోట్లకు పెంచారు. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా రూ.38 వేల కోట్లు వసూలు చేయాలని ఎక్సైజ్ శాఖకు లక్ష్యంగా నిర్ధారించారు.