Kejriwal: ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియని ద్రవం విసిరిన వ్యక్తి; కేజ్రీని సజీవ దహనం చేసే కుట్ర అన్న ఆప్
Kejriwal: దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో శనివారం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన పాదయాత్రలో ఆయనపై ఒక దుండగుడు గుర్తు తెలియని ద్రావణాన్ని చల్లాడు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో నిర్వహించిన ర్యాలీలో ఆయనపై దాడి చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కేజ్రీవాల్ పై గుర్తు తెలియని ద్రవాన్ని విసిరాడు. అయితే, ఆ ద్రావణంలో కొంత మాత్రమే కేజ్రీవాల్ పై పడింది. ఆ ద్రావణం ఏంటనే విషయంలో స్పష్టత లేదు. ఆ దుండగుడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పాదయాత్ర చేస్తుండగా..
త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో, ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పాదయాత్ర ప్రారంభించారు. శనివారం దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఆయన పాదయాత్ర చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో కేజ్రీవాల్ నడుస్తూ, తనకోసం వేచి ఉన్న ప్రజలను పలకరిస్తున్నారు. అంతలో, అకస్మాత్తుగా ఒక వ్యక్తి కేజ్రీవాల్ కు సమీపంగా వచ్చి తన వద్ద ఉన్న ద్రావణాన్ని కేజ్రీవాల్ పై విసురుగా చల్లాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది వేగంగా ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అయితే, అక్కడ ఉన్న ఆప్ కార్యకర్తలు ఆ వ్యక్తిని దేహశుద్ధి చేసి, మళ్లీ పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి చల్లిన ద్రావణం కొంత కేజ్రీవాల్ ముఖంపై పడింది.
ఆప్ విమర్శలు
ఈ ఘటనపై ఆప్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. దేశ రాజధానిలో మాజీ ముఖ్యమంత్రికి భద్రత లేకపోతే సామాన్యులు ఎక్కడికి వెళ్తారని ఆప్ ప్రశ్నించింది. బీజేపీ పాలనలో ఢిల్లీ శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని ఆప్ మండిపడింది. కాగా, కేజ్రీవాల్ పై దాడికి ప్రయత్నించిన వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వాడుగా భావిస్తున్నారు. అతడిని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేజ్రీవాల్ దక్షిణ ఢిల్లీలో ర్యాలీ నిర్వహిస్తున్నారు.
సజీవ దహనం చేసే కుట్ర
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) పై దాడి చేసిన వ్యక్తి. కేజ్రీవాల్ పై స్పిరిట్ విసిరి నిప్పంటించాలనుకున్నాడని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తికి బీజేపీతో సంబంధాలున్నాయని భరద్వాజ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కేజ్రీవాల్ పై స్పిరిట్ చల్లాడని, ఆ వాసన కూడా తమకు వచ్చిందని, ఇది కేజ్రీవాల్ ను సజీవ దహనం చేసే కుట్ర అని ఆరోపించారు. ‘‘అతడు ఒక చేతిలో స్పిరిట్, మరో చేతిలో అగ్గిపెట్టె పట్టుకుని ఉన్నాడు. అతడు విసిరిన స్పిరిట్ కేజ్రీవాల్ పై, నాపై పడింది. కానీ అతను అగ్గిపెట్టెను వెలిగించేలోపే అప్రమత్తమైన వాలంటీర్లు, ప్రజలు ఆయనను పట్టుకున్నారు’’ అని భరద్వాజ్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడో ఓటమి భయంతోనే బీజేపీ (bjp) మోసపూరిత మార్గాలను అనుసరిస్తోందని ఆప్ నేత ఆరోపించారు.