Libya floods death toll : శవాల గుట్టగా లిబియా.. వరదలకు 11వేల మంది బలి!
Libya floods death toll : లిబియాలో వరదలు సృష్టించిన బీభత్సానికి 11వేల మంది బలయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చు!
Libya floods death toll : భారీ వర్షాలు, వరదల ధాటికి.. లిబియాలోని డెర్నా ప్రాంతం శవాల గుట్టగా మారిది! ప్రకృతి చేసిన విలయతాండవానికి.. ఇప్పటివరకు 11,300మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అసలు.. అధికారిక డేటా కన్నా.. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ రెండు ఆనకట్టలు కూలడంతో..!
డానియల్ తుపాను సృష్టించిన విధ్వంసమే.. లిబియాలో తాజా పరిస్థితులకు కారణం. తుపాను ధాటికి లిబియా తీర ప్రాంతమైన డెర్నా అతలాకుతలమైంది. ఆదివారం రాత్రి డానియల్ తుపాను తీరం దాటగా.. నగరం బయట ఉన్న రెండు ఆనకట్టలు కుప్పకూలాయి. ఫలితంగా వాడి డెర్నా అనే లోయను.. వరద నీరు ముంచ్చెత్తింది. ఫలితంగా డెర్నా నగరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
Libya floods latest news : ప్రకృతి విపత్తు కారణంగా అనేకమంది గల్లంతయ్యారు. దొరికిన మృతదేహాలకు అంత్యక్రియ ప్రక్రియ సాగుతోంది. డెర్నా బయట.. ఇప్పటివరకు 3వేల మందికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రాంతం.. ప్రజల హాహాకారాలతో దద్దరిల్లింది.
మరోవైపు నగరంలోని చాలా ప్రాంతాల్లో మట్టి, బురద పేరుకుపోయింది. వీటి మధ్యలో చాలా మృతదేహాలు ఉండిపోయి ఉంటాయని అధికారులు అనుమానిస్తున్నారు. బురద కారణంగా రోడ్లు దారుణంగా తయారయ్యాయి. ఫలితంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అధికారుల ప్రకారం.. లిబియాలో ఇప్పటికీ 10,100మంది ఆచూకీ లభించడం లేదు.
Derna floods death toll : అయితే తుపాను నేపథ్యంలో స్థానిక యంత్రాంగం సరిగ్గా సన్నద్ధమవ్వలేదని, అసలు అక్కడి ప్రజలకు సూచనలు కూడా ఇవ్వలేదని, అందుకే ఈ స్థాయిలో ప్రమాదం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా.. స్థానిక యంత్రాంగం మాత్రం వీటిని కొట్టిపారేసింది. గత శనివారమే డానియల్ తుపాను గురించి కీలక సూచనలు జారీ చేసినట్టు వెల్లడించింది. అయితే.. తుపాను గురించి హెచ్చరికలు ఇచ్చినప్పటికీ.. ఆనకట్టలు కూలిపోతాయన్న సంకేతాలు చివరి నిమిషం వరకు లేకపోవడంతో మృతుల సంఖ్య ఈస్థాయిలో ఉన్నట్టు సమాచారం.
డానియల్ తుపానుతో కూలిపోయిన రెండు ఆనకట్టలను 1970 దశకంలో నిర్మించారు. ఈ రెండింటి నిర్వాహణ సరిగ్గా లేదని గతంలోనే నివేదికలు వచ్చాయి.
ఐకమత్యంతో ప్రజలు..!
Derna floods Libya : లిబియా దేశం రెండుగా చీలిపోయిన దశాబ్ద కాలం గడిచిపోయింది. తూర్పు, పశ్చిమ లిబియాలో ఇప్పుడు రెండు వేరువేరు యంత్రాంగాలు ఉన్నాయి. ఈ రెండింటికీ అస్సలు పడదు. అయితే తాజా పరిణామాల మధ్య రెండువైపులా ప్రజలు ఒక్కటైనట్టు తెలుస్తోంది. డెర్నా బాధితులను ఆదుకునేందుకు పశ్చిమ లిబియా ప్రజలు తీవ్రంగా కృషిచేస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
సంబంధిత కథనం