Learn English with Google: ఇంగ్లీష్ ఇప్పుడు ప్రపంచ భాష. అంతర్జాతీయంగా ఆమోదం పొందిన భాష. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇంగ్లీష్ పై పట్టు చాలా అవసరం. అందుకే ఇంగ్లీష్ ను నేర్చుకోవడం ఇప్పుడు ఒక అవసరంగా మారింది.
గూగుల్ సెర్చ్ ద్వారా ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అందుకు గానూ, గూగుల్ సెర్చ్ ఒక ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ ట్యూటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయం ప్రస్తుతానికి భారత్ సహా కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంది. క్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తామని గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతానికి అర్జెంటీనా, కొలంబియా, ఇండియా, ఇండోనేషియా, మెక్సికో, వెనిజులా దేశాల్లోని యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపింది. ఇంగ్లీష్ ను నేర్చుకునేందుకు విప్లవాత్మక విధానాలను ఇందులో పొందుపర్చామని తెలిపింది. ఈ లాంగ్వేజ్ ట్యూటర్ లో పర్సనలైజ్డ్ ప్రాక్టీస్ సెషన్స్, కాంటెక్స్ట్ బేస్డ్ ఫీడ్ బ్యాక్ సదుపాయాలు ఉంటాయి.
ఈ ట్యూటర్ లో విద్యార్థులకు ఇంటరాక్టివ్ ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి. విద్యార్థులను ప్రశ్నలు అడిగి, సమాధానాలు రాబడ్తారు. సమాధానంలో ఏదైనా ఒక పదాన్ని ఉపయోగించేలా ప్రశ్నలు వేస్తారు. ఒక్కో సెషన్ ను స్వల్ప వ్యవధిలో, యూజర్ కు పూర్తి అవగాహన కలిగేలా రూపొందిస్తారు. ఈ ట్యూటర్ కు రిజిస్టర్ చేసుకున్నవారికి ఏ రోజుకు ఆరోజు సెషన్ ను మర్చిపోకుండా ఉండడానికి రోజువారీ రిమైండర్స్ ఉంటాయి.
గూగుల్ సెర్చ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునేవారు ముందుగా సెర్చ్ ఇంజన్ లోని గూగుల్ ట్రాన్స్ లేట్ కింది భాగంలో ఉన్న విండోను ఓపెన్ చేయాలి. ఆ టూల్ ను ట్యాప్ చేయడం ద్వారా ఈ ఇంగ్లీష్ లెర్నింగ్ ప్రొగ్రామ్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యూజర్లు ఈ ప్రోగ్రామ్ ద్వారా స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కాంప్రహెన్షన్ స్కిల్స్.. మొదలైనవి నేర్చుకోవచ్చు. యూజర్ స్థాయిని బట్టి ప్రొగ్రామ్ ను ఎంపిక చేసుకోవచ్చు. త్వరలో ఇంగ్లీష్ తో పాటు వేరే భాషలను కూడా నేర్చుకునే అవకాశం కల్పించేలా ఈ లాంగ్వేజ్ ట్యూటర్ ను అభివృద్ధి చేయనున్నారు.