Leap Day 2024: ఫిబ్రవరి 29 లీప్ డే అని తెలుసు కదా.. కానీ ఈ ఇంట్రస్టింగ్ విషయాలు మాత్రం తెలిసి ఉండవు..
Leap Day 2024: ఈ సంవత్సరం లీప్ ఈయర్. రేపు, అంటే ఫిబ్రవరి 29 లీప్ డే. అంటే లీప్ సంవత్సరంలో వచ్చే ఎక్స్ ట్రా రోజు. ఫిబ్రవరి నెలలో సాధారణంగా 28 రోజులు ఉంటాయి. కానీ, లీప్ ఈయర్ లో మాత్రం 29 రోజులు ఉంటాయి. ఇదొక్కటే కాదు, లీప్ ఈయర్, లీప్ డే లకు సంబంధించి ఇంకా చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి.

2024 Leap Year: లీప్ డే అనే భావనను రోమన్ నియంత జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 45 లో జూలియన్ క్యాలెండర్ కోసం అమల్లోకి తీసుకవచ్చాడు. సాధారణంగా ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కానీ లీప్ సంవత్సరంలో మాత్రం 366 రోజులు ఉంటాయి. ఆ అదనపు రోజు ఫిబ్రవరి నెలలో 29వ తేదీగా వస్తుంది.
సోలార్ క్యాలెండర్ కోసం..
2024 సంవత్సరం లీప్ ఈయర్ (Leap Year). ఈ సంవత్సరంలో 366 రోజులు ఉన్నాయి. అందువల్ల ఫిబ్రవరి నెలలో 28 రోజులకు బదులుగా 29 రోజులు ఉన్నాయి. ఇది ప్రతి నాలుగు సంవత్సరాలకు పునరావృతమయ్యే సహజ దృగ్విషయం. క్యాలెండర్లను సోలార్ క్యాలెండర్ తో అనుసంధానం చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. భూమి తన కక్ష్యలో పరిభ్రమిస్తూ, సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రయాణించడానికి 365 రోజుల, 5 గంటల 48 నిమిషాల 45 సెకన్లు పడుతుంది. ఈ అదనపు సమయాన్ని సింక్రనైజ్ చేయడానికి లీప్ డే భావనను ప్రారంభించారు. అంటే, ఈ అదనపు సమయాన్ని ప్రతీ నాలుగు సంవత్సరాలకు ఒక రోజుగా మార్చుకుని, ఫిబ్రవరిలో ఆ అదనపు రోజును పొందుపర్చారు.
లీప్ డే గురించిన ఆసక్తికర విషయాలు
- : రోమన్ నియంత జూలియస్ సీజర్ క్రీస్తుపూర్వం 45 లో జూలియన్ క్యాలెండర్ కోసం లీప్ డే (Leap Day 2024) కాన్సెప్ట్ ను ప్రారంభించాడు. జూలియన్ క్యాలెండర్ లో ఫిబ్రవరిని చివరి నెలగా పరిగణిస్తారు.
- చైనీస్ ప్రజలు క్యాలెండర్లో ఒక నెల మొత్తాన్ని జోడించే సంప్రదాయాన్ని పాటిస్తారు. ఇది చివరిసారిగా 2015లో జరిగింది.
- పూర్వకాలంలో, లీప్ డేను రోల్ రివర్సల్ కోసం ప్రత్యేకమైన రోజుగా పాటించేవారు. పురుషులు స్త్రీల పట్ల తమ ప్రేమను వ్యక్తం చేయడానికి బదులుగా.. స్త్రీలే పురుషులకు ప్రపోజ్ చేసే రోజుగా దీనిని జరుపుకునేవారు. కాలక్రమేణా, ఈ సంప్రదాయం కనుమరుగైంది.
- లీప్ డే నాడు జన్మించిన శిశువులను లీప్లింగ్స్ లేదా లీప్ ఇయర్ బేబీస్ అని పిలుస్తారు. వీరు సాధారణ సంవత్సరాలలో ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న తమ పుట్టినరోజును జరుపుకుంటారు.
- 1461 జననాల్లో ఒకరు మాత్రమే లీప్ డే అయిన ఫిబ్రవరి 29న జన్మించే అవకాశాలున్నాయి.
- ప్రపంచంలో రెండు లీప్ ఇయర్ (Leap Year) రాజధానులు ఉన్నాయి. అవి ఒకటి ఆంథోనీ టెక్సాస్. మరొకటి ఆంథోనీ న్యూ మెక్సికో. ప్రతి లీప్ డే నాడు ఈ ప్రదేశాలలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి.